ఆమెలోని కవయిత్రిని త్వరలో చూస్తాం !

నయనతార మూడుకోట్లు పారితోషికం తీసుకుంటున్నదక్షిణాది అగ్రనటి. ఆమె ప్రేమలో పడడం, పెళ్లి విషయంలో ఓడిపోవడం,యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో సహజీవనం … ఇలాంటి వాటి గురించే చాలా మందికి తెలుసు. అయితే నాణేనికి బొమ్మా బొరుసులాగా ప్రతి మనిషిలోనూ పలు కోణాలుంటాయి. అలా నయనతారలో మరో కోణం చూస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి… నయనతారలో మంచి చెఫ్‌ ఉన్నారు. షూటింగ్‌ లేని సమయాల్లో రకరకాల వంటకాలతో ప్రయోగం చేయడం ఆమె కాలక్షేపాల్లో ఒక అంశం.
 
నయనతారలో మరో ముఖ్య అంశం…ఆమెలో మంచి కవయిత్రి ఉన్నారట. నయన ఇప్పటికే చాలా కవితలు రాశారట. వాటిని చాలా జాగ్రత్తగా భద్రపరచుకున్నారట. విశేషం ఏమిటంటే, తను రాసిన కవితలన్నిటిలోనూ ప్రేమ తొణికిసలాడుతుందట. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్లు ఎలా ఉండాలన్న విషయాలు ఆ కవితల్లో చోటు చేసుకుంటాయట. తను రాసిన కవితలను తరచూ చదువుకుంటారట. ఆ కవితలను పుస్తకంగా ముద్రించాలా? లేక సినిమా పాటలుగా ఉపయోగించాలా? అన్న విషయం గురించి ఆలోచిస్తున్నారట. అందువల్ల నయనలోని కవయిత్రిని త్వరలో మనం చూడబోతున్నామన్న మాట !