యంగ్ హీరోల్లో ఇతనికున్న క్రేజే వేరు !

విజయ్ దేవరకొండ ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ సినిమాలతో భారీ వసూళ్లు రాబట్టి అందరి దృష్టినీ తనవైపుకు మరల్చుకున్నాడు.కేవలం రెండే రెండు సినిమాలు.. అవికూడా చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు. అలాంటి వాటితోనే స్టార్ ఇమేజ్ కొట్టేయడమంటే మాటలు కాదు. కానీ దీనిని నిజం చేసి చూపించాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడున్న స్టార్ ఇమేజ్‌తో టాలీవుడ్ లోని యువహీరోలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు.
ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజే వేరు. దీనికి తోడు ఇటీవల స్టార్ హీరోలతో పోటీపడి ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కించుకోవడమే గాక.. ఆ అవార్డును సీఎం సహాయనిధికి ఇస్తానని ప్రకటించి సెంటరాఫ్ అట్రాక్షన్ అయ్యాడు. ఈ రకంగా సినిమాల పరంగా, సమాజం పట్ల అవగాహన పరంగా టాలీవుడ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని చెప్పకనే చెప్పాడు విజయ్.
మరోపక్క వరుస సినిమాలకు ఒకే చెప్పేసి ‘రాబోయే కాలం అంతా నాదే’ అనే హింట్ కూడా ఇచ్చేయడం టాలీవుడ్ యువహీరోలకు కంగారు పుట్టించే అంశం . ప్రస్తుతం విజయ్ చేతిలో ‘‘టాక్సీవాలా, గీత గోవిందం, నోటా, డియర్ కామ్రేడ్’’ సినిమాలున్నాయి. ఈ నాలుగు సినిమాలు వరుసపెట్టి విడుదల కానుండటం ప్రేక్షకులకు పండగే. ఇవికాక మరో రెండు సినిమాలు చర్చల్లో ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి విజయ్ స్పీడ్, యాటిట్యూడ్ చూస్తుంటే మాత్రం రాబోయే కాలంలో ఆయనో పెద్ద స్టార్ కావడం ఖాయం అనిపిస్తోంది.ఇదే మిగతా హీరోలకు జీర్ణించుకోలేని విషయం అనేది కొందరి మాట.
మూడు భాషల మ్యూజిక్‌ వీడియోలో…

వరుస సినిమాలతో ఫుల్‌ ఫాంలో ఉన్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ త్వరలో ఓ మ్యూజిక్‌ వీడియోలో సందడి చేయనున్నారు. టాక్సీవాలా, గీత గోవిందం, నోటా, కామ్రేడ్ సినిమాలు చేస్తున్న  విజయ్‌ ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ మ్యూజిక్‌ వీడియోలో నటించేందుకు అంగీకరించాడు. భానుశ్రీ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వీడియోకు సౌరభ్, దుర్గేష్‌లు సంగీతమందిస్తున్నారు.

ఈ మ్యూజిక్‌ వీడియోను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. ఈ వీడియోలో విజయ్ సరసన బెంగాలీ  మోడల్‌ మాళవిక బెనర్జీ ఆడిపాడనుంది. ఇప్పటికేషూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వీడియో ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.