“ఇకపై తానేంటో నిరూపిస్తానని, నటన విషయంలో మరింత దూకుడుగా ముందుకెళ్తా”నని ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ పేర్కొంది. సినిమా కెరీర్ గురించి ఐశ్వర్య మాట్లాడుతూ…. గతంలో స్కూలు పిల్లలా వ్యవహరించి చాలా తప్పులు చేశానని చెప్పుకొచ్చింది. పెద్దపెద్ద సినిమాల్లో వచ్చిన అవకాశాలను చేజేతులా వదులుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, కావాలని వాటిని వదులు కోలేదని, షెడ్యూల్ విషయంలో పక్కాగా ఉండడం వల్లే వాటిని వదులుకోవాల్సి వచ్చిందని ఐష్ వివరించింది.కేన్స్‌లో వరుసగా 15వ ఏడాది రెడ్ కార్పెట్‌పై నడిచిన ఐష్ వీడియో మీడియా చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేసింది.
‘‘నిజం చెప్పాలంటే అవకాశాల విషయంలో అప్పట్లో స్కూలు పిల్లలా ఆలోచించాను. షెడ్యూళ్ల విషయంలో నేను చాలా కచ్చితంగా ఉంటా. ఈ కారణంగానే పెద్ద సినిమాల నుంచి మంచి ఆఫర్లు వచ్చినా వదులుకున్నా’’ అని ఐష్ పేర్కొంది. అయితే, ఇకపై అలా ఉండదలచుకోలేదని, సినిమాలు, పాత్రల విషయంలో మరింత దూకుడుగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నానని నటి వివరించింది. అందుకు అనుగుణంగా షెడ్యూళ్లను మలచుకుంటానని తెలిపింది. తన సహచర నటులందరూ ఏడాదంతా సినిమాలు చేస్తూ బిజీగా ఉండడం తాను చూస్తున్నానని, కాబట్టి ఇకపై తాను కూడా దూకుడు పెంచాలని నిర్ణయించుకున్నట్టు ఐష్ వివరించింది.
నటిగా ఐష్ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె పట్ల తనకున్న అభిమానాన్ని లేఖ రూపంలో సీనియర్ నటి రేఖ ఇలా అభివర్ణించారు…
‘‘మై ఐష్…
నువ్వు ప్రవహించే నదిలాంటిదానివి. ఎక్కడా ఆగకుండా ప్రవహిస్తూనే ఉన్నావు. నది ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తుంది. తన గమ్యాన్ని తను అన్నుకున్నట్లుగానే, తనలాగే చేరుకుంటుంది. నువ్వూ అంతే. నువ్వేం చెప్పావన్నది జనం మర్చిపోవచ్చు. నువ్వేం చేశావన్నది కూడా మర్చిపోవచ్చు. కానీ నువ్వు వాళ్లకు ఎలాంటి ఫీలింగ్ కలిగించావు అన్నది మాత్రం ఎప్పటికీ మర్చిపోరు. మనం ఏదైనా సాధించాలంటే మనకు ఉండాల్సిన అతి ముఖ్య లక్షణం ధైర్యం.
ఎందుకంటే అది లేకపోతే మనం ఎందులోనూ నైపుణ్యం పొందలేం. ఈ విషయంలో నువ్వు దానికి లైవ్ ఎగ్జాంపుల్. నువ్వు నోరు తెరిచి మాట్లాడేలోపే నీ నమ్మకం, నీ శక్తి మాతో మాట్లాడేస్తాయి. నువ్వు అనుకున్నవన్నీ సాధించావు. అవి కూడా ఎంత అందంగా సాధించావంటే మా అందరి కళ్లు నీ నుంచి మరల్చుకోలేనంత. జీవితంలో చాలా దూరం వచ్చావు. ఎన్నో కష్టాలు అనుభవించావు. కానీ ఫీనిక్స్ పక్షి లాగా వీటన్నింటినీ దాటి పైకి లేచావు.
నిన్ను చూసి నేనెంత గర్వపడుతున్నా అన్నది మాటల్లో వర్ణించలేకపోతున్నా. నువ్వు చాలా పాత్రలు అత్యద్భుతంగా పోషించావు. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనిపించుకున్నావు. కానీ నువ్వు చేసిన అన్ని పాత్రల్లో నాకు ఇష్టమైందేంటో తెలుసా? ఇప్పుడు ఆరాధ్య అనే అద్భుతానికి పోషిస్తున్న ‘అమ్మ’ పాత్ర. ప్రేమిస్తూనే ఉండు, నీ మ్యాజిక్‌ని పంచుతూనే ఉండు. 20 ఏళ్లు అయిపోయిందా అప్పుడే! వావ్.నీ హృదయం మోయలేనన్ని, పట్టలేనన్ని శుభాకాంక్షలు, ఆశీర్వచనాలు.