మనసుకు నచ్చిన కథలనే ఎంచుకుంటోంది !

ఐశ్వర్యరాయ్ ఇమేజ్, బడ్జెట్ లెక్కలతో పని లేకుండా తన మనసుకు నచ్చిన కథలను ఎంచుకుంటున్నది.రెండేళ్లవ్యవధిలో కేవలం మూడు సినిమాలు మాత్రమే చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కథల ఎంపికలో ఆలోచించి అడుగులు వేస్తున్నది . ఇటీవలే ఐశ్వర్యరాయ్ ‘ఫన్నీఖాన్’ అనే చిత్రాన్ని అంగీకరించింది. దేశంలోనే గొప్ప గాయనిగా పేరుతెచ్చుకోవాలని ప్రయత్నించే ఓ మహిళ కథాంశంతో వినోదప్రధానంగా ఈ చిత్రం రూపొందుతున్నది. ఓ హాలీవుడ్ సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ గాయని పాత్రలో కనిపించనున్నది. ఈ సినిమాలో నటించడానికి ఐశ్వర్యరాయ్ చిత్రబృందానికి పలు షరతులు విధించినట్లు తెలిసింది. లిప్‌లాక్‌లు ఉండరాదని, పరిమితులకు లోబడే అందాల ప్రదర్శన ఉండాలని..ఇలా తాను సూచించిన పలు కండీషన్స్‌కు ఒప్పుకుంటేనే సినిమాలో నటిస్తానని చెప్పిందట.

ఆమె షరతులకు అంగీకరించిన చిత్రబృందం ఇటీవలే సినిమా చిత్రీకరణ మొదలుపెట్టారు. అయితే తొలిరోజే షూటింగ్ రద్దు చేసిన ఐశ్వర్యరాయ్ చిత్రబృందానికి ఝలక్ ఇచ్చింది. తన పాత్రకు సంబంధించి క్యాస్టూమ్స్ సరిగా లేవనే కారణంతో షూటింగ్ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయినట్లు సమాచారం. దుబాయ్, కోల్‌కతా ఇలా పలు ప్రాంతాలను సందర్శించి ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా సిద్ధంచేసిన దుస్తులు ఐశ్వర్యరాయ్‌కి నచ్చలేదని, పాప్‌సింగర్ పాత్రకు తగినట్లుగా ఆ దుస్తులు లేవనే కారణంతో షూటింగ్‌ను రద్దు చేసినట్లు సమాచారం. తిరిగి నాలుగు రోజుల విరామం తరువాతే షూటింగ్‌లో పాల్గొంటానని ప్రకటించిందట. ఆమె నిర్ణయంతో చిత్రబృందం డైలామాలో పడినట్లు తెలిసింది. ఆదిలోనే ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందోనని ఆందోళన పడుతున్నారు .