అంత‌ర్జాతీయ చిత్రోత్స‌వానికి అల్లాణి శ్రీ‌ధ‌ర్ ‘డూ డూ ఢీ ఢీ’

భార‌త ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించే బాల‌ల అంత‌ర్జాతీయ చ‌ల‌న చిత్రోత్స‌వం హైద‌రాబాద్ లో న‌వంబ‌ర్ లో జ‌రుగ‌నుంది. తెలంగాణా రాస్ట్ర ప్ర‌భుత్వ ఆతిధ్యం లో ప్ర‌పంచ వేదిక‌గా నిలిచే ఈ బాల‌ల చిత్రోత్స‌వానికి అన్ని దేశాల నుండి వేలాది చిత్రాలు పోటీ ప‌డ‌తాయి. అల్లాణి శ్రీ‌ధ‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఫిల్మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప‌తాకంపై నిర్మించిన ‘డూ డూ ఢీ ఢీ’ ( మా ఊరి కొండ‌) ఈ చిత్రోత్స‌వంలో చిల్డ్ర‌న్ వ‌ర‌ల్డ్ విభాగంలో ఎంపికైంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉత్త‌మ‌ భావాల‌తో ఉత్త‌మ సాంకేతిక విలువ‌ల‌తో నిర్మించిన చిత్రాలు చిల్డ్ర‌న్ వ‌ర‌ల్డ్ పేరిట ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతాయి. ‘కొమ‌రం భీమ్’, ‘గౌత‌మ బుద్ధ’, ‘ఫెస్టివ‌ల్ ఆఫ్ ఫెయిత్’, ‘తూహీ మేరి గంగ’ వంటి అవార్డు చిత్రాల ద‌ర్శ‌క నిర్మాత‌ అల్లాణి శ్రీ‌ధ‌ర్ ప్ర‌పంచ వ్యాప్తంగా బాల్యాన్ని కబళిస్తున్న ఒక విప‌రీత సాధార‌ణ అంశాన్ని ఇతి వృత్తంగా తీసుకుని ‘డూ డూ ఢీ ఢీ’ చిత్రాన్ని రూపొందించారు.

మొబైల్,ట్యాబ్, ఆన్ లైన్ గేమ్స్, వీడియో గేమ్స్ ఇవ‌న్నీ ఈ త‌రం బాలల్ని విప‌రీతంగా ప్ర‌భావితం చేస్తున్నాయి. డిజిట‌ల్ ఎడిక్ష‌న్ కు విరుగుడు ఏమిటి? తీవ్ర‌మైన ప్ర‌భావంతో విప‌రీత ధోర‌ణుల‌కు ముగ్గురు పిల్ల‌లు చివ‌రికి ఎలా మారిపోయారు? మ‌న సంస్కృతి ఆట పాట‌లు ఎలా వారిని ఆక‌ట్టుకున్నాయి. నిర‌ర్ధ‌కాలుగా ముద్ర వేసుకున్న ఆ డిజిట‌ల్ వ్య‌స‌నప‌రులు చివ‌రికి అందరి చేత ఎలా శ‌భాస్ అనిపించుకున్నారు? అనే క‌థాంశంతో మ‌ర‌చిపోతున్న మ‌న సాంప్ర‌దాయాల‌ను, విలువ‌ల‌ను, మాన‌వ సంబంధాల‌ను హృద‌యానికి గుర్తు చేసే విధంగా హృద్యంగా పిల్ల‌ల ఆట పాట‌ల‌తో చిత్రం రూపొందించ‌డం జ‌రిగింది. ‘శ‌త‌మానం భ‌వ‌తి’ వంటి చిత్రాలు అవార్డులు రివార్డులు సాధించ‌డం చూశాక ఈ త‌ర‌హా సినిమా విజ‌యాల ప‌ట్ల పూర్తి న‌మ్మ‌కం పెరిగింద‌ని స‌హ‌నిర్మాత కిర‌ణ్ కుమార్ చింతా తెలిపారు .

‘కొమ‌రం భీమ్’ ఫేమ్ భూపాల్ ప్ర‌ధాన పాత్ర‌లో మాస్ట‌ర్ సాయి, బేబి కావేరి, బేబి అభి, వింజ‌మూరి మ‌ధు, సంగ‌కుమార్, స‌ప్న‌, చిన్ని కృష్ణ‌, సంజ‌న‌, సుదీప్తి త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి సంగీతంః శ‌శిప్రీత‌మ్, నేప‌ధ్యం : సాబు న‌ర్గీస్, ఎడిటర్ః కంచాల శ్రీ‌నివాస్‌, స‌హ‌కార ద‌ర్శ‌కుడుః చక్రపాణి ఆనంద‌, ప్రాజెక్ట్ కో ఆర్డినేట‌ర్ః డాక్ట‌ర్ రామ‌చంద్ర వార‌ణాసి, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్ః సి.హెచ్.ల‌తీఫ్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ః చింత‌ల పూడి రామారావు, స‌మ‌ర్ప‌ణః శ్రీ‌మ‌తి చింతా ల‌క్ష్మీ నాగేశ్వ‌ర‌రావు, ర‌చ‌న‌, నిర్మాణం, ద‌ర్శ‌క‌త్వంః అల్లాణి శ్రీ‌ధ‌ర్‌.