త్వరలో ఆ ఛాన్స్‌ వస్తుందని ఆశిస్తున్నా!

‘అజిత్‌తో నటించాలన్న కోరిక చాలా రోజులుగా ఉంది. త్వరలో ఆ ఛాన్స్‌ వస్తుందని ఆశిస్తున్నా’ అని అంటోంది హీరోయిన్‌ అమలా పాల్‌. ‘నాయక్‌’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘బెజవాడ’, ‘జెండాపై కపిరాజు’ వంటి తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అమలా ఆ తర్వాత ఎక్కువగా తమిళ, మలయాళ చిత్రాలపైనే దృష్టిపెట్టింది. ధనుష్‌తో కలిసి ఆమె నటించిన ‘విఐపి 2′ ఇటీవల తమిళనాట విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంటోంది.

ఈ సందర్భంగా అమలా పాల్‌ మాట్లాడుతూ….’ఇందులో చాలా కష్టపడి నటించాను. హీరో ధనుష్‌ నాకు మంచి స్నేహితుడు. ఆయన నుంచి అనేక విషయాలు నేర్చుకున్నా. చిన్నప్పుడే కాజోల్‌ నటన చూసి ఆమెను ఆదర్శంగా తీసుకున్నా. ఈ చిత్రంలో ఆమెతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం కోసం దర్శకురాలు సౌందర్య తీవ్రంగా శ్రమించారు. ప్రతి చిన్న విషయంపైనా ఆమె చాలా శ్రద్ధ పెట్టారు. విజయ్, విక్రమ్‌ వంటి అగ్ర హీరోలతో నటించాను. అజిత్‌తో నటించే అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాను. ఆయనతో నటించే అవకాశం మరోసారి వస్తుందని ఆశిస్తున్నా. జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. అయితే ఎప్పుడూ సమస్యలకు బెదిరిపోలేదు’ అని తెలిపింది. అమల ప్రస్తుతం ‘థిరుట్టు పాయలె 2’, ‘భాస్కర్‌ ఓరు రాస్కెల్‌’, మలయాళ ‘క్వీన్‌’ రీమేక్‌లోనూ అలాగే మరో రెండు ఇతర భాషా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.