లాభాల్లో డబ్భై శాతం అతనికే !

మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్ నటించిన ‘దంగల్’ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా సరికొత్త రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే. ఇటీవలే చైనాలో విడుదలైన ఈ చిత్రం అక్కడ ఏకంగావెయ్యి కోట్ల కలెక్షన్లను రాబట్టింది. దీంతో అమీర్‌ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ గురించి ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ముంబయి సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు వచ్చే లాభాల్లో 70శాతాన్ని అమీర్‌ఖాన్‌కు ఇచ్చేలా ఒప్పందం కుదిిందని తెలిసింది.

ఆదిత్యచోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ చిత్రం వెయ్యికోట్ల కలెక్షన్స్ సాధిస్తే..అందులో 700కోట్లు అమీర్‌ఖాన్‌కు చెందేలా నిర్మాత ఆదిత్యచోప్రా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని చెబుతున్నారు. సినిమా విడుదలకు ముందు ట్రేడ్‌పరంగా బాలీవుడ్‌లో జరిగిన అతిపెద్ద ఒప్పందం ఇదేనని అంటున్నారు. బ్రిటీష్‌కాలం నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా థగ్స్ ఆఫ్ హిందోస్థాన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అమితాబ్‌బచ్చన్, కత్రినాకైఫ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలావుండగా దంగల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1800కోట్ల కు పైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో అమీర్‌ఖాన్ తన పారితోషికం 35కోట్లతో పాటు లాభాల్లో ముఫ్పైశాతం వాటాను తీసుకున్నారని చెబుతున్నారు.