ఘనంగా దిగ్దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ పుట్టినరోజు !

*38 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నుంచి వరల్డ్ రికార్డ్ గుర్తింపు*
*ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్న 43వ సినిమా “వేదవ్యాస్” మేకింగ్ వీడియో లాంఛ్*
సకుటుంబ కథా చిత్రాలతో తెలుగు తెరకు మిరుమిట్లు గొలిపే విజయాలు అందించిన దిగ్దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి ప్రస్తుతం తన 43వ సినిమా “వేదవ్యాస్” రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె . అచ్చిరెడ్డి సమర్పణలో నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి తన సాయి ప్రగతి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పిడుగు విశ్వనాథ్  హీరోగా అరంగేట్రం చేస్తుండగా…కొరియన్  నటి జూన్ హ్యూంజీ,  మంగోలియన్ నటుడు షరన్ బోల్డ్ సెగ్మెంట్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. “వేదవ్యాస్” సినిమా ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ రోజు దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో పుట్టినరోజు వేడుకలతో పాటు “వేదవ్యాస్” సినిమా మేకింగ్ వీడియో లాంఛ్ చేశారు. 38 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నుంచి వరల్డ్ రికార్డ్ గుర్తింపు పత్రాన్ని అందజేశారు. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ – ఎస్వీ కృష్ణారెడ్డి గారు గొప్ప దర్శకులు. మంచి మనసున్న వ్యక్తి. ఆయన సకుటుంబంగా చూసే ఎన్నో అద్భుతమైన చిత్రాలు రూపొందించారు. ఆ సినిమాలన్నీ వినోదంతో పాటు సమాజానికి సందేశాన్ని కూడా చెప్పాయి. పిల్లల నుంచి పెద్దల దాకా ఎస్వీ గారి సినిమాలను ఆస్వాదించారు. నేను సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి కారణం ఎస్వీ కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు. మన వేదాల గొప్పదనం, వాటి వెనక ఉన్న సైన్స్ గురించి చెబుతూ కృష్ణారెడ్డి గారు “వేదవ్యాస్” కథ సిద్ధం చేశారు. ఇలాంటి కథతో సినిమా చేస్తే నేటి సమాజానికి మంచిని చెప్పినట్లవుతుందని ఆయన నాతో అన్నారు. నేను వెంటనే మూవీ చేసేందుకు అంగీకరించాను. ఈ సినిమా కోసం నిర్మాతగా ఆయన ఏది చెబితే అది ఫాలో అయ్యాను. “వేదవ్యాస్” సినిమా షూటింగ్ పూర్తయింది. మూవీ చాలా బాగా వచ్చింది. మా సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నా. తను దర్శకత్వం వహించిన 42 చిత్రాల్లో 38 సినిమాలకు సంగీతం అందించిన రికార్డ్ ఆయనకే సొంతం.  కృష్ణారెడ్డి గారు నూరేళ్లు సంతోషంగా జీవించాలి. మరెన్నో విజయాలు సాధించాలి !అన్నారు.

నటుడు అలీ మాట్లాడుతూ – జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి హీరో దాకా ఒకేలా గౌరవించే గొప్ప మనసున్న వ్యక్తి ఎస్వీ గారు. ఆయన చీమకు కూడా హాని చేయరు. 42 చిత్రాల్లో 38 సినిమాలకు సంగీతం అందించడం మామూలు విషయం కాదు. ఆయనతో మా అందరిదీ 35 ఏళ్ల జర్నీ. ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేమంతా చిన్నపిల్లలయ్యాం. ఆయన వందో పుట్టినరోజు కూడా మేమంతా హాజరవ్వాలి. కృష్ణారెడ్డి గారి వేదవ్యాస్ సినిమా ఘన విజయం సాధించాలి. అన్నారు.

దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ – ఇంతమంది నిర్మాతలు, దర్శకులు, నటీనటులు అతిథులుగా వచ్చారు కాబట్టే ఈరోజు నా పుట్టినరోజు కార్యక్రమం ఇంత ఘనంగా జరుపుకున్నాం. నా పుట్టినరోజున నా మ్యూజిక్ కు ఒక రికార్డ్ దక్కింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ వారి నుంచి మెమొంటో అందుకున్నాను. ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలి. మీరంతా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. నా రాబోయో వేదవ్యాస్ సినిమాను కూడా సక్సెస్ చేస్తారు. మీ అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నారు.

నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ – ఎందరో ఆత్మీయుల మధ్య కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు, వేదవ్యాస్ మేకింగ్ వీడియో లాంఛ్, ఎస్వీ గారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరుపుకున్నాం. మా ఈ 43 చిత్రాల జర్నీలో నటీనటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, ఇతర మిత్రులు సహకరించడం వల్లే మేము ఇక్కడి వరకు రాగలిగాం. ఈ వేడుక ఇంత ఘనంగా జరుపుకోగలిగాం. ఈరోజు కార్యక్రమాన్ని జర్నలిస్ట్ ప్రభు, శివ మల్లాల బాగా డిజైన్ చేశారు. దాదాపు 10 రోజులుగా వారి టీమ్స్ ఈ కార్యక్రమం సక్సెస్ చేసేందుకు శ్రమించారు. అందుకే ఇంత బ్యూటిఫుల్ గా ఈవెంట్ జరుపుకోగలిగాం. మిత్రుడు ఉమాపతిరాజు ఆయన సోదరుడు శ్రీహరిరాజు ఎస్వీని నన్ను ప్రశంసిస్తూ పాటలు రూపొందించారు. వారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. మేము ఇంత కాన్ఫిడెంట్ గా జోష్ తో పనిచేయడానికి కారణం, మాకు బ్యాక్ బోన్ లా నిలిచింది ప్రొడ్యూసర్ కొమ్మూరి ప్రతాపరెడ్డి గారు. ప్రతాపరెడ్డి గారు కృష్ణారెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, అభిమానం, నమ్మకంతో వేదవ్యాస్ సినిమాను రూపొందించేందుకు సంపూర్ణమైన స్వేచ్ఛ, సహకారం, ప్రోత్సాహం ఇచ్చారు. ఆ సహకారంతోనే ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఈ సినిమా చేస్తున్నాం. వేదవ్యాస్ సినిమా మా అందరికీ కమ్ బ్యాక్ మూవీ అవుతుంది. కృష్ణారెడ్డి గారి పవర్, ఆయన ఆలోచనా ధోరణి ఏంటి అనేది ప్రేక్షకులు తెలియజేయాలి అనే తపనతో గత నాలుగైదు ఏళ్లుగా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూ వచ్చాం. వేదవ్యాస్ స్క్రిప్ట్ విషయంలో పరుచూరి గోపాలకృష్ణగారు, సత్యానంద్ గారు, మరెంతోమంది తమ సహకారం, ప్రోత్సాహం అందించారు. ఇలాంటి స్క్రిప్ట్ ను ఒక దృశ్యకావ్యంగా ప్రేక్షకులకు అందించాలంటే సమర్థవంతమైన, నమ్మకమైన, శక్తిమంతమైన ప్రొడ్యూసర్ కావాలి. ఆ నిర్మాత భగవంతుడు పంపినట్లు మా కొమ్మూరి ప్రతాపరెడ్డి గారి రూపంలో వచ్చారు. ఈ రోజు మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది కాబట్టి నమ్మకంగా చెబుతున్నాం. కృష్ణారెడ్డి గారు తన మనసులో అనుకున్న విజన్ ను ఈ రోజు సినిమాలో మేము చూడగలిగాం. గ్రాఫిక్స్ చాలా పనిచెప్పే కంటెంట్ మా మూవీలో ఉంది. ఫాంటమ్ కంపెనీ నుంచి మంచి సీజీ టీమ్ మా మూవీ కోసం వర్క్ చేస్తున్నారు. మా డీవోపీ శరత్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, నృత్య దర్శకురాలు సుచిత్ర, ఫైట్ మాస్టర్ పృథ్వీ, అంజి మాస్టర్ అద్భుతంగా వర్క్ చేశారు. అన్నారు.