ఎట్టకేలకు పెళ్లికి స్వీటీ సిద్ధమయ్యింది !

‘అరుంధతి’ అనుష్క పెళ్లికి పచ్చజెండా ఊపిందా..? అవుననే … ఇప్పుడు సోషల్‌మీడియాల్లో వైరల్‌ అవుతోంది. అందానికి, అభినయానికి మారు పేరు …పన్నెండు ఏళ్లుగా సౌత్ ఇండస్ట్రీని పాలిస్తున్న బ్యూటీ అనుష్క శెట్టి. ‘బాహుబలి’, ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ వంటి పలు హిట్ సినిమాలతో ఈ భామ ప్రేక్షకుల హృదయాల్లో  నిలిచిపోయింది.తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయకిగా రాణిస్తున్నారు. ఈ బ్యూటీకి త్వరలో పెళ్లి చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదివరకే అనుష్క పెళ్లిపై చాలా వదంతులు ప్రచారం అవుతూ వచ్చాయి. అందులో ‘బాహుబలి’ప్రభాస్‌తో ప్రేమాయణం అనీ, త్వరలో ఆయన్ని పెళ్లి చేసుకోనుందంటూ వదంతులు హోరెత్తాయి.

అనుష్కను ప్రభాస్‌ పెళ్లి చేసుకోవడానికి ఆయన కుటుంబసభ్యులు అంగీరించలేదనే ప్రచారం కూడా జరిగింది. కాగా ‘అనుష్క మంచి స్నేహితురాలు మాత్రమే’ అని ఇటీవల ప్రభాస్‌ స్పష్టం చేశారు. ఇంతకాలం చిత్రాలతో బిజీగా ఉన్న అనుష్క ఆ సాకుతో పెళ్లిని వాయిదా వేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం కొత్త చిత్రం ఒక్కటీ కూడా అంగీకరించలేదు. పలు అవకాశాలు వస్తున్నా, నచ్చిన కథ కోసం ఎదురు చూస్తున్నట్లు ఇటీవల ఒక భేటీలో అనుష్క పేర్కొన్నారు.

మరోపక్క తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని పోరుతూనే ఉన్నారు. రెండేళ్లుగా అనుష్కకు వరుడిని చూసే పనిలో ఉన్నా.. సెట్‌ కావడం లేదని సమాచారం.జాతక దోషం ఉందని జ్యోతిష్కులు చెప్పడంతో దోషం నివారణ కోసం ఇటీవల అనుష్కతో దైవ పూజలు నిర్వహించారు. ఆ పూజల ఫలమే కావచ్చు …అనుష్క మనసు పెళ్లిపై మరలిందంటున్నారు.  ఎట్టకేలకు పెళ్లి చేసుకోవడానికి ఈ స్వీటీ ఓకే చెప్పారట. ఈ ఏడాదిలోనే అనుష్క పెళ్లి చేసేయాలని ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మీడియా వర్గాల సమాచారం.

గత కొంతకాలంగా అనుష్క పెళ్లిపై పలు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు వీటిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇప్పుడు మరోసారి ఈ భామ పెళ్లిపై వార్తలు వచ్చాయి. ఖచ్చితంగా అనుష్క ఈ ఏడాది చివరలో పెళ్లి కూతురు కానుందని సమాచారం. ఆమె తల్లిదండ్రులు వరుడి కోసం బాగానే వెతుకుతున్నారట. మంచి వరుడు దొరికిన వెంటనే అనుష్క పెళ్లి చేస్తారని తెలిసింది. అందుకే ఈ భామ కొత్త సినిమాలు కూడా ఒప్పుకోవడం లేదు. హిట్ మూవీ ‘భాగమతి’ వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటివరకు మరో సినిమాకు సైన్ చేయలేదు ఈ భామ. ఆమధ్య మలయాళంలో ఓ ఆఫర్ వచ్చినా కూడా నో చెప్పేసింది ఈ బ్యూటీ. దాంతో అనుష్క త్వరలో పెళ్లి చేసుకోవడం ఖాయమని అంటున్నారు. అందుకే ఆమె ఈమధ్య గుళ్లు గోపురాలను దర్శించుకుంటోంది.