మళ్లీ ప్రేమించి పెళ్లి చేసుకుంటా !

నేనేమైనా సన్యాసిగా మారి హిమాలయాలకు వెళతాననుకుంటున్నారా అంటోంది హీరోయిన్‌ అమలాపాల్‌. 2015లో దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లాడిన ఈ భామ ఏడాదిపాటు సంసార జీవితాన్ని ఎంజాయ్‌ చేసింది. ఆ తరువాత భర్త నుంచి విడిపోవడం, విడాకులు తీసుకోవడం కూడా చకచకా జరిగిపోయాయి. ఆ వెంటనే నటిగా రీఎంట్రీ ఇచ్చి వరుసగా చిత్రాలు చేసేస్తోంది.

ప్రస్తుతం అమలాపాల్‌ చేతి నిండా చిత్రాలున్నాయి. అందులో తమిళంతో పాటు, మలయాళం చిత్రాలు ఉండడం విశేషం. ధనుష్‌కు జంటగా నటించిన ‘వేలై ఇల్లా పట్టాదారి-2’ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం అమల… విష్ణువిశాల్‌కు జంటగా ‘మిని మిని’, అరవిందస్వామితో ‘భాస్కర్‌ ఒరు రాస్కెల్‌’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ బోల్డ్‌ అండ్‌ బ్యూటీ  ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటుంది.

ఈ మధ్య గాయని సుచిత్ర విడుదల చేసే తన రాసలీలల వీడియో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొని హాట్‌ టాఫిక్‌గా మారింది. తాజాగా ఇచ్చిన ఒక భేటీలో మళ్లీ పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు ‘నేను ఏమైనా సన్యాసిగా మారి హిమాలయాలకు వెళ్లతానని చెప్పానా? కచ్చితంగా మళ్లీ పెళ్లి చేసుకుంటా. అదీ ప్రేమ వివాహమే అవుతుంది. అలాంటి సమయం వచ్చినప్పుడు మీకు ముందే తెలియజేస్తా నని  అంటోంది