సినీవినోదం రేటింగ్ : 3/5
జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజస్, శివాని శివాత్మిక ఫిలింస్ బ్యానర్ల పై ప్రవీణ్ సత్తారు రచన దర్శకత్వం లో ఎం. కోటేశ్వరరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు .
నిరంజన్ అయ్యర్(ఆదిత్ అరుణ్) ఓ విలువైన డేటాను ఎవరికో ఇవ్వడానికి ఇంటర్నెట్ ద్వారా బేరసారాలు చేస్తుంటాడు. అయితే నిరంజన్‌ను కొందరు వ్యక్తులు చంపడానికి ప్రయత్నిస్తుంటారు. మరోవైపు నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫీసర్ శేఖర్(రాజశేఖర్)కు డ్యూటీ అంటే ప్రాణం. తను చేసే పనిని ఎవరికీ చెప్పడు..చెప్పుకోకూడదు. కాబట్టి తన భార్య, పిల్లాడుతో సమయాన్ని కేటాయించలేకపోతుంటాడు. దాంతో శేఖర్ భార్య స్వాతి(పూజా కుమార్), అతని నుండి విడిపోవాలనుకుంటుంది. ఓ సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా శేఖర్, నిరంజన్‌ని అరెస్ట్ చేస్తాడు. శేఖర్, నిరంజన్‌ని చంపాలని కొంత మంది ప్రయత్నిస్తారు. అసలు వారెవరు? నిరంజన్ దగ్గరున్న డేటా ఏమిటి? నిరంజన్‌ను శేఖర్ కాపాడాడా? జార్జ్ ఎవరు? జార్జ్‌కు, శేఖర్‌కు రిలేషన్ ఏంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా లో చూడాల్సిందే.
టీజర్,ట్రైలర్ బావుండటం వల్ల …ప్రవీణ్ దర్శకత్వం అవ్వటం వల్ల తప్పనిసరిగా చూడాలనిపించే సినిమా ఈ ‘గరుడ వేగ’. ఒక యాక్షన్ సన్నివేశంతో సినిమా ప్రారంభం అయ్యి , రాజశేఖర్ పాత్ర ప్రవేశించగానే వచ్చే సన్నివేశం కాస్త విసుగు అనిపిస్తూ సాగుతుంటే … ‘అబ్బా! మళ్ళీ వద్దనుకున్న గోల ఇదేంటిరా బాబు’ అనుకుంటున్న క్షణంలో టక్కున కథలోకి తీసుకెళ్లే సన్నివేశాలతో ఆసక్తి కలిగిస్తూ … విరామ సన్నివేశం వరకు అత్యంత ఉత్కంఠ కలిగించేలా తీసిన విధానం అద్భుతం.మరీ ముఖ్యంగా బాంబ్ ఎక్కడుందో కనిపెట్టే సన్నివేశం అయితే… ఊపిరి బిగపట్టి చూసేలా తీసాడు.రెండవ భాగం తొలి భాగం అంత ఆసక్తికరం గా అయితే లేదు.అణ్వాయుధాల తయారీకి ఉపయోగించే ఫ్లూటోనియం ఎగుమతిలో జరిగిన కుంభకోణం వెలికితీయటం … అన్నది ప్రధానాంశం గా మలిసగం సాగుతుంది.ఆ కుట్రని వివరించిన తీరు,దానికి సంబంధించిన ప్రధాన విలన్ … అంత ప్రభావితంగా అనిపించవు .అలాగే పతాక సన్నివేశం కూడా ఏదో నాటకీయంగా జరిగిపోతుంది.
చాలా రోజుల తర్వాత మంచి యాక్షన్ థ్రిల్లర్ చూసిన అనుభూతిని కలిగించాడు ప్రవీణ్. సినిమాకి తగ్గ బడ్జెట్ ఉంటే తానేంటి … అన్నది నిరూపించగలిగాడు.ముందు ముందు ఇంకా మంచి దర్శకుడు అనిపించుకుంటాడనటంలో సందేహం లేదు.సినిమాలో నేపధ్యసంగీతం కుమ్మేశాడు.సినిమా మూడ్ కి తగ్గట్టు అరిపించారు.సాంకేతికంగా చాలా ఉన్నతంగా ఉంది.రాజశేఖర్ కి మంచి పునరాగమన సినిమా.తాను ఎందుకు ‘ఇలాంటి పాత్రలకి ప్రత్యేకం’ అన్నది స్పష్టంగా కనపడుతుంది .కొన్ని అనవసరమైన సన్నివేశాలు,ఉపయోగం లేని పాటలు తీసేసి… కాస్త నిడివి తగ్గించి ఉంటే సినిమా ఇంకా బావుండేది.కధాంశం దృష్ట్యా… ఒక తరహా సినిమా అవటం వల్ల అన్ని వర్గాల ప్రేక్షకులకి ఎంత మేరకు చేరుతుంది అన్నది చెప్పలేము.కానీ చూసిన వారిని మాత్రం నిరాశపరచదు.ఒక మంచి ఇంటెన్స్ యాక్షన్ స్పై థ్రిల్లర్.
ఎన్ఐఏ అధికారి పాత్రలో రాజశేఖర్ ఒదిగిపోయి కనిపించారు. యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఆయన పెర్ఫామెన్స్ బావుంది. ఇంతకు ముందు రాజశేఖర్ కు ఈ సినిమాలో రాజశేఖర్ కు స్పష్టమైన తేడా కనిపిస్తుంది. హ్యాకర్ పాత్రలో నటించి అదిత్ నటన కూడా మెప్పించింది.హీరోయిన్ పూజ కుమార్ కూడా చికాకు పుట్టించే భార్య పాత్రలో బాగానే నటించింది. శ్రద్ధాదాస్ పాత్ర పరవాలేదనిపించే విధంగా ఉంటుంది. ఆదర్శ్ బాలకృష్ణ పాత్ర చిన్నదైనప్పటికీ ప్రేక్షకులని థ్రిల్ కు గురిచేస్తుంది.పృధ్వీ కామెడీ నవ్వించకపోగా అసహనం కలిగిస్తుంది. రాజకీయ నాయకుల పాత్రల్లో నటించిన షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, డాక్టర్స్ పాత్రలో నటించిన అలీ, ఎన్‌ఐఏ చీఫ్ ఆఫీసర్‌గా నటించిన నాజర్, ఇక ఎన్‌ఐఏ సభ్యులుగా రవివర్మ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
కిషోర్ కనిపించే సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేకపోయినా… సినిమాలో జార్జ్ అనే స్టైలిష్ విలన్ పాత్రలో అతని నటన చాలా బావుంది. సన్నీలియోని పాట కానీ, అక్కడ జరిగే కామెడీ కానీ ఈ కథకి ఎంత మాత్రం అవసరం లేదు. సినిమా ద్వితీయార్థం కాస్త స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది. రాజశేఖర్,పూజాకుమార్ నేపథ్యంలో సాగే కొన్ని సన్నివేశాలని ఇంకాస్త ఎడిటింగ్ చేసి ఉంటే బావుండేది.
సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో సినిమాటోగ్రఫీ, యాక్షన్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్స్‌గా నిలిచాయి. తన టెక్నికల్ టీమ్‌నుంచి ఇంత చక్కని అవుట్‌పుట్ తీసుకున్న ప్రవీణ్ సత్తారుని అభినందించాలి. నిర్మాత ఈ చిత్రాన్ని చక్కటి క్వాలిటీతో అందించారు – రవళి