సరికొత్త ప్రపంచంలో విహరింప జేసే ‘అవతార్’ సీక్వెల్స్

ఆన్ స్క్రీన్‌పై అద్భుతాలు చూపించడంలో సిద్ధహస్తుడైన ఆ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్.. ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలతో డబుల్ ధమాకా ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. సీక్వెల్స్‌గా అలరించడానికి సిద్ధమవుతోన్న ఆ చిత్రాలు.. ప్రేక్షకుల్ని సరికొత్త ప్రపంచంలో విహరింప చేయబోతున్నాయి.
ఒక సినిమా హిట్టవ్వగానే.. దానికి కొనసాగింపుగా సీక్వెల్స్ రావడం కామనే. అయితే సూపర్ డూపర్ హిట్టయిన ‘అవతార్’ చిత్రానికి ఒకేసారి నాలుగు సీక్వెల్స్ ప్రకటించి.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు డైరెక్టర్ జేమ్స్ కేమరాన్. ఇక ప్రకటించడమే కాదు.. తాజాగా ‘అవతార్’ సిరీస్‌లో రెండు, మూడు సీక్వెల్స్ షూటింగ్‌ను కూడా పూర్తి చేసేశాడట ఈ హాలీవుడ్ టాప్ డైరెక్టర్.
అద్భుతమైన గ్రాఫిక్స్ మాయాజాలంతో.. పండోరా అనే సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసి తొమ్మిదేళ్ల క్రితం ‘అవతార్’ సినిమాతో అరుదైన విజయాన్ని అందుకున్నాడు జేమ్స్. ‘అవతార్’ సినిమా ఏకంగా 2.7 బిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి ఇప్పటివరకూ ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇక 2020 డిసెంబర్‌లో విడుదలయ్యే ‘అవతార్-2’.. 2021 డిసెంబర్‌లో విడుదలయ్యే ‘అవతార్-3’ చిత్రాలు.. మొదటి వెర్షన్‌కు మించిన రీతిలో హై వోల్టేజ్ యాక్షన్ ఘట్టాలతో సిద్ధమవుతున్నాయట.
‘అవతార్’ మొదటి పార్ట్‌లో పండోర గ్రహంలోని నావి పీపుల్‌తో.. నేలమీద, ఆకాశంమీద సాహసాలు చూపించిన జేమ్స్ కేమరాన్.. 2, 3 పార్టులలో అండర్ వాటర్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాడట. గతంలో తాను తెరకెక్కించిన ‘అబిస్’ (Abyss) చిత్రం తరహాలో అండర్ వాటర్‌లో.. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్సెస్‌ను చూపించబోతున్నాడట. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ సీక్వెల్స్.. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్నాయి. మొత్తంమీద మరో రెండేళ్లలో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ‘అవతార్-2’.. మూడేళ్లలో అలరించడానికి సిద్ధమవుతోన్న ‘అవతార్-3’ చిత్రాలతో.. జేమ్స్ కేమరాన్.. ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

‘అవతార్‌’ సీక్వెల్స్‌కి కొత్త పేర్లు

అద్భుతమైన విజువల్స్‌కి, ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్స్‌కి, సందేశానికి కేరాఫ్‌ ‘అవతార్‌’. జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టికి ప్రతిరూపం. 2009లో విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించి 2.8 బిలియన్‌ డాలర్ల కలెక్షన్లను సాధించింది. దీనికి కొనసాగింపుగా వరుసగా నాలుగు సీక్వెల్స్‌ను రూపొందించేందుకు చిత్ర బృందం ప్లాన్‌ చేసింది. ‘అవతార్‌ 2’, ‘అవతార్‌ 3’, ‘అవతార్‌ 4’, ‘అవతార్‌ 5’ పేర్లతో 2020 నుంచి వరుసగా సినిమాలు విడుదలవుతాయని గతంలో దర్శకుడు కామెరూన్‌ ప్రకటించారు. అయితే ఈ సీక్వెల్స్‌కి కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. రెండో భాగానికి ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’, మూడో భాగానికి ‘అవతార్‌: ది సీడ్‌ బేరియర్‌’, నాలుగో భాగానికి ‘అవతార్‌: ది టల్కన్‌ రైడర్‌’, ఐదో భాగానికి ‘అవతార్‌: ది క్వెస్ట్‌ ఫర్‌ ఈవా’ అనే టైటిల్‌ పెట్టే ఆలోచనలో చిత్ర బృందం ఉందట. ఇప్పటికే ఈ రెండు సీక్వెల్స్‌ షూటింగ్‌ పార్ట్‌ పూర్తయ్యాయని, ప్రస్తుతం 4, 5 సీక్వెల్స్‌కి సంబంధించిన షూటింగ్‌ జరుగుతుందని తెలుస్తోంది. ఇక ఈ సీక్వెల్స్‌ వరుసగా 2020 డిసెంబర్‌ 18న ‘అవతార్‌ 2’ , 2021 డిసెంబర్‌ 17న ‘అవతార్‌ 3’ , 2022 డిసెంబర్‌ 20న ‘అవతార్‌ 4’, 2023 డిసెంబర్‌ 19న ‘అవతార్‌ 5’ విడుదల చేయనున్నట్టు దర్శకుడు కామెరూన్‌ ప్రకటించారు.