నాన్నలాగే నేను కూడా అన్ని రంగాల్లోనూ…

‘నా సినిమాలకు సంబంధించిన అన్ని నిర్ణయాలు నేనే తీసుకుంటాను. నచ్చిన విషయాన్ని స్వేచ్ఛగా చేయమని నాన్న (కమల్‌ హాసన్‌) చెబుతుంటారు. అలాగని నేనెప్పుడు హద్దు మీరలేదు’ అని అంటోంది శ్రుతి హాసన్‌. ఇటీవల ‘సంఘమిత్ర’ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్న శ్రుతి హాసన్‌ టాలీవుడ్‌, కోలీవుడ్‌ల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.

ఈ నేపథ్యంలో తన కెరీర్‌ గురించి శ్రుతి చెబుతూ, ‘కెరీర్‌ ప్రారంభం నుంచే నేను ఓ ప్లాన్‌ ప్రకారం అడుగులు వేస్తున్నాను. హిందీ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం కావాలన్నది పూర్తిగా నా నిర్ణయమే. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నాను. ఇప్పటి వరకు నేను నటించిన సినిమాల్లో నా పూర్తి స్తాయి నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం రాకపోవడం బాధాకరం. అయితే అన్ని భాషా చిత్రాల్లో నటించి పేరు ప్రతిష్టలు సంపాదించాలనేది నా ఆకాంక్ష. దాన్ని కొంత మేరకు నెరవేర్చుకున్నాను. తక్కువ కాలంలో అగ్రతారగా నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. కమల్‌ హాసన్‌ కుమార్తె అనేది వెండితెరపై నా పరిచయానికి మాత్రమే ఉపయోగపడింది. తొలి చిత్రం అవకాశం సులభంగానే లభించినా నైపుణ్యం ఉంటేనే చిత్ర సీమలో నిలదొక్కుకోగలరని మా నాన్న చెప్పేవారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా రంగంలో రాణిస్తున్నాను. మా నాన్న నుంచి అన్ని విషయాలు నేర్చుకున్నారు. నటన, గానం, దర్శకత్వం… ఇలా అన్ని రంగాల్లోనూ ఆయనకు మంచి అనుభవం ఉంది. నాన్నలాగే నేను కూడా అన్ని రంగాల్లోనూ ప్రావీణ్యం సంపాదించాలనుకుంటున్నా. సవాళ్లతో కూడిన పాత్రల్లో నటించి నా నైపుణ్యాన్ని విస్తృతం చేసుకోవాలనుకుంటున్నా. అందుకు తగిన సమయం కోసం వెయిట్‌ చేస్తున్నా’ అని తెలిపింది. శ్రుతి ప్రస్తుతం ‘బహెన్‌ హోగి తేరి’, ‘శభాష్‌ నాయుడు’ చిత్రాల్లో నటిస్తోంది.