‘సూపర్ స్టార్’ కోసం తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోందా ?

కత్రినాకైఫ్… కత్రినా టాలీవుడ్ సూపర్ స్టార్ కోసం తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుందా?  టాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్న కథానాయకుడు మహేష్‌బాబు. బ్లాక్‌బస్టర్ హిట్స్ ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ సినిమాల్లో కోటీశ్వరుడిగా నటించి ప్రేక్షకులను అలరించారు ఈ టాప్ హీరో. ప్రస్తుతం అదే తరహాలో ‘మహర్షి’ సినిమాతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుండగా… ఓ ముఖ్యమైన పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది.

‘మహర్షి’ సినిమా అనంతరం మహేష్ తదుపరి చిత్రం సుకుమార్ దర్శకత్వంలో ఉండబోతుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ సరసన కథానాయికగా రకుల్‌ప్రీత్ సింగ్, కియారా అద్వానీ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే తాజాగా మహేష్ హీరోయిన్ల జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినాకైఫ్ పేరు కూడా చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ తన సినిమాలో మహేష్‌కు జోడీగా కత్రినాను ఎంచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇదిలాఉండగా కత్రినాకైఫ్ తన సినీ కెరీర్ ప్రారంభంలో తెలుగులో రెండు సినిమాలు చేసింది. ఒకటి వెంకటేష్ సరసన ‘మల్లీశ్వరి’, బాలకృష్ణతో ‘అల్లరి పిడుగు’ చిత్రాల్లో ఈ బ్యూటీ నటించింది. ఆతర్వాత పూర్తిగా బాలీవుడ్‌కు పరిమితమై అక్కడ టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. అయితే, ‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్ ప్రతిష్ట ఎంతో పెరిగింది.ఇలాంటి తరుణంలో కత్రినా టాలీవుడ్ సూపర్ స్టార్ కోసం తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుందా? అన్నది వేచి చూడాలి.