భారీ డాన్స్‌ నేపథ్య చిత్రంతో మెస్మరైజ్‌ చేయనుంది !

బాలీవుడ్‌లో డాన్స్‌ నేపథ్య చిత్రాలకు దర్శకుడు రెమో డి సౌజా పెట్టింది పేరు. కొరియోగ్రాఫర్‌ అయిన రెమో దర్శకుడిగా మారిన విషయం విదితమే. డాన్స్‌ నేపథ్యంతో ‘ఎబిసిడి’, ‘ఎబిసిడి 2’ చిత్రాలతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నారు. తాజాగా మరో భారీ డాన్స్‌ నేపథ్య చిత్రాన్ని రూపొందించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో వరుణ్‌ ధావన్‌, కత్రీనా కైఫ్‌ జంటగా నటించనున్నారు.
ఈ ఇద్దరు తనదైన డాన్స్‌ విలక్షణతో మెస్మరైజ్‌ చేయడం ఖాయమని నిర్మాత భూషణ్‌ కుమార్‌ భావిస్తున్నారు.

ఈ చిత్రం గురించి కత్రీనా కైఫ్‌ చెబుతూ, ‘రెమో విజన్‌లో మేం భాగం కావడం ఎగ్జైటింగ్‌గా ఉంది. వరుణ్‌ ప్యాషన్‌ అద్భుతం. ఎలాంటి అలుపు లేకుండా వెండితెరపై మ్యాజిక్‌ చేయడంలో వరుణ్‌ దిట్ట. ఈ చిత్రంలో నటించేందుకు ఆతృతగా వెయిట్‌ చేస్తున్నాం’ అని తెలిపింది.

వరుణ్‌ ధావన్‌ మాట్లాడుతూ, ‘ఇండియాలోనే అతిపెద్ద డాన్స్‌ నేపథ్య చిత్రంలో భాగం కావడం, రెమో డి సౌజా వంటి దర్శకుడితో పనిచేయడం పెద్ద అఛీవ్‌మెంట్‌గా భావిస్తున్నా. న్యూయార్క్‌లో ఓ సారి కత్రీనాతో కలిసి ఓ ప్రదర్శన ఇచ్చాం. తిరిగి మళ్ళీ కలిసి నటించడం హ్యాపీగా ఉంది. కత్రీనా అద్భుతమైన డాన్సర్‌’ అని అన్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాను ప్రారంభించి వచ్చే ఏడాది నవంబర్‌ 8న విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుంది. కత్రీనా ప్రస్తుతం ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’, ‘జీరో’లో, వరుణ్‌ ధావన్‌.. ‘అక్టోబర్‌’, ‘నవాబ్‌జాదే’, ‘సూయి దాగా’ చిత్రాల్లో నటిస్తున్నారు.