థ్రిల్లై పోతా !.. నా ఎనర్జీ రెట్టింపు అవుతుంది !

“లస్ట్‌ స్టోరీస్‌’ నా కెరీర్‌కు టర్నింగ్‌పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాతే నటిగా ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగలననే నమ్మకం దర్శకుల్లో కలిగింది. ‘లస్ట్‌ స్టోరీస్‌’ ప్రశంసలను తెచ్చిపెడితే, ‘కబీర్‌సింగ్‌’ ప్రేక్షకుల ప్రేమను పంచింది. కెరీర్‌ తొలినాళ్లలో అదృష్టాన్ని ఎక్కువగా నమ్మేదాన్ని. కానీ “కష్టపడేతత్వమే ప్రతిభకు తార్కాణమని.. ‘మాటలు కాదు, మనం చేసే పని మాట్లాడాలి” అని సల్మాన్‌ఖాన్‌ ఇచ్చిన సలహాతో నటనను మెరుగుపరుచుకోవడంపై దృష్టిపెట్టాను”…అని ఆంటోంది బాలీవుడ్‌ హీరొయిన్ కియారా అద్వాణీ.
“అత్యుత్తమ ప్రతిభను కనబరచడానికి అభద్రతాభావం, పోటీతత్వం దోహదపడతాయి. నాకు తెలిసి ప్రతి ఒక్క యాక్టర్‌కి ఇన్‌సెక్యురిటీ ఫీలింగ్‌ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే.. అదీ మంచిదే !. భయం బాధ్యతను నేర్పుతుంది. బలంగా, మెరుగ్గా తయారవ్వడానికి ఉపకరిస్తుంది”…అని ఆంటోంది ఈ బాలీవుడ్‌ భామ.
 
సంతోషంతో రెక్కలు వస్తాయి !
నా గురించి ఎవరైనా మంచి విషయాలు చెప్పినప్పుడు, ప్రోత్సాహకరమైన మెసేజ్‌లు పెట్టినప్పుడు థ్రిల్లై పోతాను. అవి నా ఎనర్జీని రెట్టింపు చేస్తాయి. సంతోషంతో రెక్కలు వస్తాయి.విమర్శను సీరియస్‌గా తీసుకోను. అయినప్పటికీ నేను ఇబ్బందిపడేంత విమర్శను ఇప్పటి వరకైతే ఎదుర్కోలేదు.అయితే తరచుగా చివరి నిమిషంలో నిర్ణయాల్ని మార్చుకుంటాను. అదే నా బలహీనత అని నా స్నేహితులంతా అంటుంటారు. ఆ ఒక్క విషయంలో నన్ను నేను మార్చుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నా. సినిమాల ఒత్తిడి నుంచి దూరం అవ్వడానికి పెయింటింగ్స్‌ వేస్తుంటాను. ట్రావెలింగ్‌కు ప్రాధాన్యతనిస్తాను. సముద్రతీరాలు మనసుకు స్వాంతన చేకూర్చుతాయి. ఏ మాత్రం విరామం దొరికినా మాల్దీవులకు వెళ్లి స్కూబా డైవింగ్‌ చేస్తుంటాను.
 
దయగా ఉండే వాళ్ళంటే ఇష్టం !
అహంకార మనస్తత్వమున్న వ్యకులకు దూరం ఉండటానికి ప్రయత్నిస్తా. మనసులో ఏదీ దాచుకోకుండా సూటిగా మాట్లాడే వాళ్లు, నిజాయితీగా ఉండేవాళ్లు, ఇతరుల పట్ల దయగా ఉండేవాళ్లు, స్వయంకృషితో పైకి వచ్చిన వాళ్లు అంటే ఇష్టం. నన్ను నవ్వించే వ్యక్తులు, నేను చెప్పే జోకులను నవ్వే వ్యక్తులు అంటే కూడా ఇష్టం. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ, తప్పొప్పుల్ని సమంగా స్వీకరించే గుణం ఉన్న వ్యక్తి జీవితభాగస్వామిగా రావాలని కోరుకుంటున్నా. నా జీవితంలోకి వచ్చే వ్యక్తి నిజాయితీ కలిగి ఉంటూ.. ఎప్పుడూ సరదాగా నవ్విస్తూ ఉండాలి. అలాంటి లక్షణాలున్న వ్యక్తి కోసమే ఎదురుచూస్తున్నా’ అని చెప్పింది.