అరుదైన మైలురాయిని చేరుకోబోతున్న మమ్ముట్టి

ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి  తన కెరీర్‌లో ఓ అరుదైన మైలురాయిని అందుకోబోతున్నాడు . అంతేకాదు, త్వరలో తన కొడుకు యువ హీరో దుల్కర్ సల్మాన్ తో కలసి నటించబోతున్నాడట ఈ సీనియర్ మలయాళ స్టార్. ఇప్పటికే 399 చిత్రాలు పూర్తి చేసి 400వ సినిమా వైపు అడుగులు వేస్తున్నాడు. సెప్టెంబర్ 7న మమ్ముట్టి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన 400వ సినిమా వివరాలను ప్రకటించబోతున్నారట.
 35 సంవత్సరాల నటనా ప్రయాణంలో ఎన్నో విభిన్నమైన కథలతో విజయవంతమైన సినిమాల్లో నటించాడు మలయాళ నటుడు మమ్ముట్టి. మలయాళంతో పాటు అడపాదడపా ఇతర భాషల ప్రేక్షకులను కూడా పలకరించిన  మమ్ముట్టి కెరీర్‌లో భారీ విజయాన్ని అందించిన సినిమాకు సీక్వెల్‌గా ఈ 400వ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ఇది ఏ సినిమా అనేది మాత్రం సెప్టెంబర్-7నే రివీల్ చేయనున్నారట. ప్రముఖ మలయాళ దర్శకుడు అమల్ నీరద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషలకు సుపరిచితుడైన మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో తండ్రితో కలసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. మొత్తానికి ఏ రకంగా చూసినా మమ్ముట్టి అభిమానులకు ఇదో స్పెషల్ మూవీ. అయితే ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం మమ్ముట్టి బర్త్ డే వరకూ ఆగాల్సిందే !