ఎన్నో ఏళ్లుగా సినీ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు వచ్చింది. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటైన ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న మరో భారీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.
గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ నటుడు-దర్శకుడు ద్వయం, భారతీయ చలనచిత్ర రంగంలో సరికొత్త రికార్డులను సృష్టించేందుకు, ఒక అసాధారణమైన సినిమా ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.
అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రం దైవిక నేపథ్యంతో రూపుదిద్దుకోనుంది. పురాణాల స్ఫూర్తితో సాగే కథనం, లోతైన భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన యుద్ధ సన్నివేశాలు, అద్భుతమైన సరికొత్త ప్రపంచ నిర్మాణంతో ఈ చిత్రం ప్రేక్షకులకు అపూర్వమైన అనుభూతిని అందించనుంది.
ఎన్టీఆర్ నట విశ్వరూపానికి, త్రివిక్రమ్ కలం బలానికి తోడుగా ఈ దైవిక కథాంశం తోడవ్వడం సినిమాపై అంచనాలను ఆకాశాన్నంటేలా చేస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం అత్యున్నత స్థాయి సాంకేతిక బృందం పని చేస్తోంది. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. తనదైన నేపథ్య సంగీతంతో, పాటలతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లనున్నారు. ఈ చిత్రానికి ఆయన అందించే సంగీతం ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.
ఈ ప్రపంచస్థాయి భారీ చిత్రాన్ని నిర్మించడానికి అగ్ర నిర్మాణ సంస్థలు చేతులు కలిపాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన నటుడు–దర్శకుడు కలయికల్లో ఒకటైన ఎన్టీఆర్–త్రివిక్రమ్ జోడీ, రెండు అగ్ర నిర్మాణ సంస్థలతో కలిసి మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత భారీ స్థాయి దృశ్యకావ్యాల్లో ఒకటిగా నిలవనుంది.

















