మేనల్లుడి సినిమాలో మెరుస్తాడట ‘ప‌వర్ స్టార్’

‘ప‌వర్ స్టార్’ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ‘అజ్ఞాత‌వాసి’ త‌ర్వాత రాజకీయాల‌లోకి వ‌చ్చి సినిమాలు చేయ‌డం మానేశాడు. అతనికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. చేసింది కేవ‌లం పాతిక చిత్రాలే అయినా అభిమానుల్ని మాత్రం అసంఖ్యాకంగా  సంపాదించుకున్నాడు ప‌వర్ స్టార్. ఆయనతో సినిమా చేయడానికి దర్శకనిర్మాతలు ఎదురుచూస్తుంటారు. ఒక్క చిత్రమైనా పవన్ తో చేస్తే చాలు అనుకునేవారూ ఉన్నారు.  అభిమానులు ‘పవన్ మళ్లీ నటిస్తే బావుండు’ అని కోరుకుంటున్నారు.  త‌మ అభిమాన హీరో మళ్లీ ఎప్పుడు వెండితెర‌పై కనిపిస్తాడా? అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ, ఇది సాధ్యమా? ఇప్ప‌ట్లో కుదురుతుందా? అని అనుకునే అభిమానులకు ఓ తీపి కబురు.
 
సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ త్వ‌ర‌లో వెండి తెర‌పై అరంగేట్రం చేయనున్నాడనే విషయం తెలిసిందే. దీనికోసం వైష్ణవ్ ప్రస్తుతం న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుంటున్నాడ‌ని సమాచారం. ఇక వైష్ణ‌వ్ తేజ్ తొలి చిత్రాన్ని ‘గోపాల గోపాల’, ‘కాటమరాయుడు’ చిత్రాల డైరెక్టర్ కిషోర్ కుమార్ పార్థసాని (డాలి) దర్శకత్వం వహించనున్నాడట. ఈ నేపథ్యంలో ప‌వ‌న్ మేన‌ల్లుడు మూవీని దర్శకత్వం వహిస్తున్న డాలికి ప‌వ‌న్‌తోనూ మంచి సాన్నిహిత్యం ఉన్నందున ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం ప‌వ‌ర్ స్టార్‌ని కలిశారట. దీనికి పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనేది తాజాగా హల్ చల్ చేస్తున్న వార్త. మేన‌ల్లుడి కోసం డాలి అభ్య‌ర్ధ‌న‌ను ప‌వ‌న్ అంగీక‌రించినట్లు తెలిసింది. దీంతో ఈ చిత్రం ద్వారా ప‌వ‌న్ మళ్లీ మేక‌ప్ వేసుకుని వెండితెర‌పై మెరుస్తాడని అభిమానులు ఆశ పడుతున్నారు. మ‌రి ఇందులో నిజ‌మెంత ఉందో? తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాలి.