విజయవంతమైన చిత్రాల నిర్మాత శివప్రసాద్‌రెడ్డి కన్నుమూత

శోభన్‌బాబు, చిరంజీవి, నాగార్జునలతో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కామాక్షి మూవీస్‌ అధినేత డి.శివప్రసాద్‌రెడ్డి శనివారం ఉదయం ఆరున్నర గంటలకు చెన్నైలో అపోలో ఆసుపత్రిలో కన్ను మూశారు. కొంత కాలం క్రితం ఆయన ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేయించుకొన్నారు. అయితే ఇటీవల మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స ఫలించక శనివారం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య పద్మజ, కుమారులు చందన్‌రెడ్డి, కైలాశ్‌ రెడ్డి ఉన్నారు.
నెల్లూరు జిల్లాలోని ఉత్తరమూపు గ్రామంలో 1956లో జన్మించిన శివప్రసాద్‌రెడ్డికి సినిమా అంటే ఎంతో అభిమానం. అందుకే డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం జోలికి వెళ్లకుండా సినిమాలకు ఫైనాన్స్‌ చేస్తుండేవారు. సినిమా వారితో పరిచయాలు పెరిగిన తర్వాత 1985లో కామాక్షి మూవీస్‌ సంస్థను నెలకొల్పి ‘శ్రావణసంధ్య’ చిత్రంతో నిర్మాణరంగంలోకి ప్రవేశించారు. అందులో శోభన్‌బాబు హీరోగా నటించారు. ఆ తర్వాత ఆయనతోనే ‘కార్తిక పౌర్ణమి’ నిర్మించారు శివప్రసాద్‌ రెడ్డి. ‘విక్కీ దాదా’ (1987) నుంచి అక్కినేని నాగార్జునతో శివప్రసాద్‌ రెడ్డికి అనుబంధం ఏర్పడింది. నాగార్జున నిర్మాతగానే ఆయన కెరీర్‌ కొనసాగింది.
‘విక్కీ దాదా’ తర్వాత చిరంజీవి హీరోగా నిర్మాత శేఖర్‌బాబుతో కలసి ‘ముఠా మేస్త్రి’ చిత్రం నిర్మించారు. ఆ తర్వాత మరో హీరో దగ్గరకు వెళ్లకుండా నాగార్జునతోనే సినిమాలు తీశారు. ‘అల్లరి అల్లుడు’, ‘ఆటోడ్రైవర్‌’, ‘సీతారామరాజు’, ‘‘ఎదురులేని మనిషి’, ‘నేనున్నాను’, ‘బాస్‌’, ‘కింగ్‌’, ‘కేడీ’, ‘రగడ’, ‘గ్రీకువీరుడు’ … ఇవన్నీ నాగార్జున, శివప్రసాద్‌రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలే. కామాక్షి బేనరుపై శివప్రసాద్‌ రెడ్డి 14 చిత్రాలు నిర్మిస్తే వాటిల్లో 11 సినిమాల్లో నాగార్జునే హీరో కావడం విశేషం. 
‘‘నా ఆప్త మిత్రుడిని కోల్పోయాను. శివప్రసాద్‌ రెడ్డి నా కుటుంబానికి చాలా దగ్గరివాడు. నా 33 ఏళ్ల సినీ కెరీర్‌లో ప్రముఖుడు. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను’’ అని నాగార్జున ట్వీట్‌ చేశారు. ‘‘శివప్రసాద్‌రెడ్డి నాతో ‘ముఠా మేస్త్రి చిత్రం చేశారు. ఆయన సాత్వికుడు. నాకు మంచి మిత్రుడు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని చిరంజీవి సంతాపం వ్యక్తపరిచారు. నేడు శివప్రసాద్‌రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.