వాటికి మించిన అవార్డులు నాకు అక్కరలేదు !

కేవలం ఒక్కరి వల్లే విజయాలు వస్తాయని భావించడంలో అర్థం లేదని అంటున్నది రకుల్‌ప్రీత్‌సింగ్.ఓ సినిమా ఫలితాన్ని నాయకానాయికలతో పాటు అనేక అంశాలు ప్రభావితం చేస్తాయని చెబుతున్నది .  తెలుగులో అగ్రకథానాయికల్లో ఒకరిగా చెలామణి అవుతున్న ఆమె గత కొంతకాలంగా ఇతర భాషా చిత్రాలపై దృష్టిసారిస్తున్నది. తమిళం, హిందీ భాషల్లో స్టార్‌డమ్‌ను సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నది.

స్టార్ హీరోలు, పేరున్న దర్శకులతో మాత్రమే సినిమాలు చేయాలని తానెప్పుడూ కోరుకోలేదని అంటున్నది. మనసుకు నచ్చిన పాత్ర అయితే నిడివితో పట్టింపులు లేకుండా నటిస్తానని, ఈ విషయంలో తాప్సీ తనకు స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొంది. రకుల్‌ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ… ఓ సినిమాను అంగీకరించే ముందు అందులో హీరో ఎవరూ? దర్శకుడికి సక్సెస్‌లు ఉన్నాయా? లేవా? అనే అంశాలకు నేనెప్పుడు విలువ ఇవ్వను. కథ, నా పాత్రకున్న ప్రాధాన్యతను మాత్రమే చూస్తాను. అంతిమంగా నా పాత్రకు మంచి పేరు వస్తే చాలనుకుంటాను. ఎన్ని సినిమాలు చేశామనేది కాకుండా ఎలాంటి సినిమాలు చేశామనేది నాకు ముఖ్యం. కెరీర్‌లో ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే మంచి సినిమాలు చేశానని గర్వపడాలి. వాటికి మించిన అవార్డులు నాకు అక్కరలేదు అని తెలిపింది.