పబ్లిసిటీ కోసం దర్శకుడికి హీరో లిప్‌కిస్

కొత్త సినిమాను జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రచారానికి చాలా డబ్బు కావాలి .  అది సినిమాను ప్రజల్లో ప్రమోట్ చేసుకునే పద్ధతి. ఇప్పడు కాలం మారింది. ఓ సినిమా షూటింగ్ నిర్వహిస్తుండగానే ఆ సినిమాను జనంలోకి తీసుకెళ్లి, దానిపై చర్చించుకునేలా రకరకాల పద్ధతుల్లో ప్రమోట్ చేస్తున్నారు బాలీవుడ్ నటీనటులు. బాలీవుడ్ నటీనటులు తమ సినిమాల ప్రమోషన్ల కోసం దేనికైనా తెగిస్తారనడంలో ఎటువంటి అనుమానం లేదు.

కొన్ని నెలల క్రితం బాలీవుడ్ నటుడు రితేష్ దేష్ముఖ్ త్వరలో విడుదల కానున్న‘బ్యాంక్ చోర్’అనే సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు నిజజీవితంలో ఓ వస్త్ర దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డాడు. హీరో రితేష్ తమ షాపింగ్ మాల్ కు వచ్చి వస్త్రాలు కొన్నాడనే సంతోషంలో ఉన్న షాపింగ్ మాల్ యజమాని తన వద్ద ఉన్న లైవ్ సిసి టివిని పరిశీలిస్తుండగా అవాక్కయ్యే సన్నివేశం కంటపడింది. హీరో రితేష్ తన చొక్కాలో ఓ టీషర్ట్ ను దోపుకుని బయటకు వెళ్లిపోయాడు. కేవలం రూ.300 నుండి రూ.500ల ఖరీదు చేసే టీషర్ట్ ను దొంగిలించాల్సిన అవసరం రితేష్ కు లేదు.  ఇది సినిమా ప్రమోట్ చేసుకునే జిమ్మిక్కు అని ఆ తర్వాత తెలియడంతో మాల్ యాజమాన్యం ముక్కున వేలేసుకున్నారు.

అదే తరహాలో మరో బాలీవుడ్ సినిమా ప్రమోషన్ జరిగింది. ఈ సారి ఆ సినిమాను ప్రమోట్ చేయడం కోసం కథానాయక,నాయికిలు విదేశాల్లోకి వెళ్లి బహిరంగంగా రోడ్డపై డ్యాన్స్ చేయడం మొదలెట్టారు. ఇది చూసిన అక్కడి జనం వింతగా చూస్తుండిపోవడమేకాకుండా సినిమాకు కావాల్సిన బ్రహ్మాండమైన ప్రచారం జరిగిపోయింది.సినిమా ప్రమోషన్ల కోసం ఎంతకైనా తెగించే బాలీవుడ్ లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. రణబీర్ కపూర్, కత్రినాకైఫ్ జంటగా అనురాగ్ బసు నిర్మిస్తున్న ‘జగ్గా జాసూన్’ సినిమా ప్రెస్ మీట్ సందర్భంగా హీరో రణబీర్ దర్శకుడికి ముద్దుల వర్షం కురిపించాడు. దర్శకుడు అనురాగ్ పెదాలాపై అందరి ముందూ ముద్దులు ఇవ్వడంతో అక్కడున్నవారంతా ముక్కున వేలేసుకున్నారు.