సల్మాన్ ‘టైగర్ జిందా హై’ కలెక్షన్ల సునామీ

“సల్మాన్ ఈజ్ బ్యాక్”.. బాలీవుడ్ బాక్సాఫీస్ రారాజు తన లేటెస్ట్ మూవీ ‘టైగర్ జిందా హై’తో మరోసారి కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు. రికార్డులన్నీ బద్దలు కొడుతూ దూసుకెళ్తున్నాడు. కేవలం మూడు రోజుల్లోనే రూ.114.93 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది ‘టైగర్ జిందా హై’. తొలి వీకెండ్‌లోనే ఈ రేంజ్ కలెక్షన్లు సాధించిన తొలి హిందీ మూవీగా రికార్డు కొల్లగొట్టింది. ఈ క్రమంలో తన రికార్డులను కూడా బద్దలు కొట్టాడు సల్మాన్‌ఖాన్. ఒక్క ఆదివారం రోజే టైగర్ రూ.45.53 కోట్లు వసూలు చేయడం విశేషం. గతంలో సల్మాన్‌ఖాన్ మూవీస్ తొలి మూడు రోజుల్లో వసూలు చేసినవాటి కంటే ఎక్కువే టైగర్ జిందా హై వసూలు చేసింది. ‘బజరంగీ భాయ్‌జాన్’ 102.60 కోట్లు, ‘సుల్తాన్’ 105.53 కోట్లు, ‘ట్యూబ్‌లైట్’ రూ.64.77 కోట్లు వసూలు చేయగా.. టైగర్ వాటన్నింటినీ మించిపోయింది.

ఇప్పటివరకు 12 సల్మాన్‌ఖాన్ సినిమాలు వంద కోట్ల క్లబ్‌లో చేరాయి. ఇది ఏ బాలీవుడ్ హీరో వల్ల కాని రికార్డు. అంతేకాదు రూ.300 కోట్ల క్లబ్‌లో సల్మాన్ మూవీస్ ఇప్పటికే రెండు ఉండగా.. ఈ మూవీ కూడా అందులో దాదాపు చేరినట్లే కనిపిస్తున్నది. గతంలో ‘భజరంగీ భాయ్‌జాన్’ (రూ.320 కోట్లు), ‘సుల్తాన్’ (రూ.300 కోట్లు) ఈ క్లబ్‌లో ఉన్నాయి. ఒక్కరోజులో రూ.45 కోట్లు వసూలు చేయడం కూడా హిందీ సినిమా హిస్టరీలో రికార్డే. క్రిస్మస్ హాలీడే కూడా కలుపుకుంటే.. టైగర్ వసూళ్ల సునామీ ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు.