ఫోర్బ్స్‌ టాప్‌ 100లో షారుక్‌ , సల్మాన్‌ , అక్షయ్‌

ప్రపంచంలో అత్యధికంగా పారితోషికం తీసుకునే టాప్‌ 100 ఫోర్బ్స్‌ సెలబ్రిటీల జాబితాలో భారతీయ నటులు చోటు దక్కించుకున్నారు. ప్రముఖ అమెరికన్‌ బిజినెస్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ సోమవారం విడుదల చేసిన ఈ జాబితాలో బాలీవుడ్‌ నటులు షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌ టాప్‌ 100లో ఉన్నారు. 2016 జూన్‌ 1 నుంచి 2017 జూన్‌ 1 వరకు లెక్కల ప్రకారం ఈ జాబితాను విడుదల చేశారు.

షారుక్‌ 38 మిలియన్‌ డాలర్ల (రూ. 245 కోట్లు) పారితోషికం తీసుకొని 65 స్థానంలో ఉన్నారు. 2016లో షారుక్‌ ‘ఫ్యాన్‌’, ‘డియర్‌ జిందగీ’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

సల్మాన్‌ 37 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 238 కోట్లు) పారితోషికంతో జాబితాలో 71 స్థానంలో ఉన్నారు. 2016లో ఆయన ‘సుల్తాన్‌’ చిత్రంతో ఘన విజయం అందుకున్నారు. 35.5 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 228 కోట్లు) పారితోషికంతో అక్షయ్‌ 80వ స్థానంలో ఉన్నారు. గత ఏడాది ఆయన నటించిన ‘ఎయిర్‌లిఫ్ట్‌’, ‘రుస్తుం’, ‘హౌస్‌ఫుల్‌ 3’ చిత్రాలు విజయం అందుకున్నాయి.

ప్రపంచంలో అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న అథ్లెట్స్‌లో టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టాప్‌ 100 జాబితాలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన 22 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 141 కోట్ల) పారితోషికంతో 89వ స్థానంలో ఉన్నారు.