ఒకే సినిమాకోసం మూడు నిర్మాణ సంస్థలు

జగపతి ఫిలిమ్స్, సురేష్ ప్రొడక్షన్స్, అన్నపూర్ణ స్టూడియోస్, వైజయంతి మూవీస్, రామకృష్ణ సినీ స్టూడియోస్ వంటి పెద్ద నిర్మాణ సంస్థలు అప్పట్లో  సొంతంగానే సినిమాలు నిర్మించేవి.  రామానాయుడు వంటి లెజెండరీ ప్రొడ్యూసర్  వంద సినిమాలు తీసారు. కానీ కాలం మారింది… పరిస్థితులు మారాయి. నిర్మాణ వ్యయం తలకు మించిన భారం కావడంతో పాటు చిన్న తేడా వచ్చినా నిలువునా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే రిస్క్ తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. అందుకే బాలీవుడ్ తరహా ట్రెండ్ తెలుగులో కూడా ఊపందుకుంటోంది.

తాజాగా వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్‌లో రూపొందబోయే కొత్త సినిమాకు ఏకంగా మూడు నిర్మాణ సంస్థలు చేతులు కలవడం విశేషం. వచ్చే నెలలో షూటింగ్ మొదలుకానున్న ఈ మూవీకి బాబీ దర్శకుడు. వెంకటేష్ హీరో కనుక సురేష్ ప్రొడక్షన్స్ ఒక నిర్మాణ సంస్థ అయితే దర్శకుడు బాబీ తరపున కోన వెంకట్ కూడా నిర్మాతగా చేరాడు. ఈమధ్య కల్యాణ్‌రామ్‌తో ‘ఎంఎల్‌ఎ’ వంటి మంచి హిట్ మూవీని తీసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో ఒక సినిమా చేస్తానని నాగచైతన్య గతంలో మాటిచ్చాడట. దీంతో చైతన్య కూడా హీరోగా చేస్తున్న ఈ చిత్రానికి పీపుల్  మీడియా ఫ్యాక్టరీ మరో నిర్మాణ సంస్థగా ఉంది. మల్టీస్టారర్ మూవీ కాబట్టి బడ్జెట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో మూడు నిర్మాణ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి.