పూరీ `ఫైటర్`తోనే బాలీవుడ్ ఎంట్రీ ?

బాలీవుడ్‌లో ఓ సినిమా చేయాలని విజయ్ దేవరకొండ ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేస్తున్న `ఫైటర్` కోసం పూరీ అలాంటి కథనే సిద్ధం చేయడంతో… ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే మంచిదని విజయ్ అనుకుంటున్నాడట.
‘ఇస్మార్ట్ శంకర్` సినిమాతో ఇటీవల బిగ్ మాస్ హిట్ కొట్టిన దర్శకుడు పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. `ఫైటర్` పేరుతో ఈ సినిమా రూపొందబోతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల కాబోతోంది.
‘పాన్ ఇండియా’ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదలవుతుందట. `అర్జున్‌రెడ్డి` కారణంగా బాలీవుడ్‌లో విజయ్‌కి మంచి ఇమేజి ఏర్పడింది. బాలీవుడ్‌ వేడుకలకు, పార్టీలకు విజయ్ హాజరవుతున్నాడు. ప్రముఖులతో అనుబంధం ఏర్పరుచుకుంటున్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్‌లో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు పూరీ `ఫైటర్`తోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే మంచిదని విజయ్ అనుకుంటున్నాడట.
 
నటుడిగా ప్రతీకారం తీర్చుకుంటా
‘‘నేను ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిని. హీరోగా జీవితం మొదలైన కొత్తలో.. నా సినిమాలను జనం ఇష్టపడక పోయేవారు. నా స్నేహితులు సినిమాలు చూస్తూ మధ్యలో వెళ్లిపోయినా.. ఆ తర్వాత వారి అభిప్రాయాన్ని నాతో షేరు చేసుకునేవార”ని విజయ్‌ దేవరకొండ తెలిపాడు.”నా సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ఆడినా.. ఆడకపోయినా నేను పట్టించుకోను. కానీ, ఆ తర్వాత ఓ నటుడిగా ప్రతీకారం తీర్చుకుంటాను’ అని అంటున్నాడు విజయ్‌ దేవరకొండ. ఇటీవల విజయ్‌ సినిమాలు అనుకున్న మేర విజయాన్ని సాధించలేకపోయాయి.
 
‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా విడుదలైన సమయంలో ఓ చిన్న అమ్మాయి నా దగ్గరకు వచ్చి.. ‘డియర్‌ కామ్రేడ్‌’లోని మొదటి భాగం మాత్రమే తనకు నచ్చిందని, రెండవ భాగం నచ్చలేదని చెప్పింది. అది నిజమైన విమర్శ.. దానిని నేను అంగీకరిస్తాను. అయితే దానిపై నేను ఎటువంటి విమర్శ చేయను. నేను చేసే సినిమాలను ఇష్టపడతాన’ని విజయ్‌ తెలిపాడు.
 
‘సినీ పరిశ్రమ ఒక వ్యాపారం. ఇక్కడ డబ్బు, అధికారం ఇలా చాలా అంశాల ప్రభావం ఉంటుంది. నేను ఏదైతే అనుకున్నానో.. అది చేయడానికే సినిమాల్లోకి వచ్చాను. సినిమా విజయవంతం అవుతుందా, లేదా అనే విషయాన్నినేను పట్టించుకోను. నేను కేవలం మంచి సినిమాలు మాత్రమే చెయ్యాలని అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కువ మంది నా చిత్రాన్ని ఇష్టపడకపోతే.. ‘నేను అంటే ఏంటో’.. నా తరువాతి చిత్రంలో చూపిస్తాను’ అని విజయ్‌ అన్నాడు .