ఈ సినిమాకు ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేసారు !

వివాదాల నుంచి తప్పించుకునేందుకు విజయ్ హీరో గా చేస్తున్న ‘మెర్సల్’  సినిమాకు ముందుగానే ట్రేడ్ మార్క్ రిజిస్టర్  చేసారు . ఇటీవల కొన్ని సినిమాలు రకరకాల వివాదాల్లో చిక్కుకొంటున్నాయి. స్టోరీ కాపీ కొట్టారని ఒకరంటే, తమ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ సినిమా తీశారని మరొకరంటున్నారు. ఆందోళనలు చేస్తున్నారు. ఇక ఫలానా సినిమా కథ తనదే నంటూ కొందరు రచయితలు కోర్టు కెక్కుతున్నారు. అలాగే కొన్ని సినిమాలపై టైటిల్ వివాదాలూ ఉన్నాయి. సాధారణంగా కంపెనీలు తాము ఉత్పత్తి చేసే వస్తువులకు ఒక ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేయించుకుంటాయి. అంటే ఆ వస్తువుపై అన్ని హక్కులూ ఆ కంపెనీకే ఉంటాయన్న మాట. ఈ నేపథ్యంలో ‘మెర్సల్’ మూవీ కూడా అదే బాట పట్టింది. ద‌క్షిణ‌భార‌త సినీ చ‌రిత్రలో సినిమా పేరుకు ట్రేడ్ మార్క్ సంపాదించిన మొద‌టి చిత్రంగా విజ‌య్ ‘మెర్సల్’  మూవీ నిలిచింది. గ‌తంలో ట్విట్ట‌ర్ ఎమోజీని సంపాదించిన మొద‌టి చిత్రంగా కూడా ‘మెర్సల్’  పేరు సంపాదించుకుంది. ట్రేడ్ మార్క్ రావడం వల్ల ఈ సినిమా మార్కెటింగ్ లో ముందంజలో ఉందని అంటున్నారు.

ఈ ట్రేడ్‌మార్క్ హ‌క్కుల ప్ర‌కారం ఎవ‌రైనా ‘మెర్సల్’  టైటిల్‌ను వాణిజ్య అవ‌స‌రాల‌కు వినియోగించుకుంటే నిర్మాత‌లకు రాయ‌ల్టీ చెల్లించాల్సి ఉంటుంది. టైటిల్‌ను ముందే ట్రేడ్‌మార్క్ చేసుకోవ‌డం వ‌ల్ల సినిమా విడుద‌ల‌య్యాక టైటిల్ త‌మ‌దంటూ ఎవ‌రూ అనే అవ‌కాశం ఉండ‌ద‌ని కూడా ‘మెర్సల్’ యూనిట్ పేర్కొంది. అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం దీపావ‌ళికి రిలీజవుతోంది. విజ‌య్ ఈ మూవీలో త్రిపాత్రాభిన‌యం చేశాడు. అత‌నికి జంటగా స‌మంత‌, కాజ‌ల్‌, నిత్యామీన‌న్‌ న‌టించారు.