నచ్చితే ఇమేజ్‌ గురించి కూడా పట్టించుకోను !

ఆమె ‘బోల్డ్‌ యాక్ట్రస్‌’.. ‘సంచలన నటి’ కూడా.. ఆండ్రియా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.చాలా సెలక్టివ్‌ పాత్రల్లోనే కనిపించే ఆండ్రియా నటించిన తాజా చిత్రం తరమణి. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో ఆడ్రియా నటనకు ప్రశంసలతో పాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆండ్రియా ఐటీ కంపెనీలో పనిచేసే యువతిగా నటించింది.అంతే కాదు ఒక పిల్లాడికి తల్లిగానూ నటించింది. అసలు విషయం ఇవేవీ కాదు.ఈ చిత్రంలో మద్యం తాగడం, దమ్ము కొట్టడం వంటి సన్నివేశాల్లో నటించడమే విమర్శలకు దారి తీస్తోంది. అయితే అలాంటి విమర్శలను అస్సలు పట్టించుకోనంటోంది ఆండ్రియా. అదే విధంగా ఇమేజ్‌ గురించి కూడా ఆలోచించనని అంటోంది.

దీని గురించి ఆండ్రియా స్పందిస్తూ…తనకు నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రెడీ అంది.దర్శకుడు రామ్‌ తరమణి చిత్ర కథను చెప్పి ఇందులో ‘మందు కొట్టాలి, సిగరెట్‌ తాగాలి’ అని చెప్పారని, కథ, తన పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే అన్నానని తెలిపింది. ప్రస్తుతం ‘వడచెన్నై’, ‘తుప్పరివాలన్‌’ చిత్రాల్లో నటిస్తున్నానని, ఈ రెండు చిత్రాల్లోనూ తన పాత్రలు వైవిధ్యంగా నటనకు అవకాశం ఉంటుందని చెప్పింది. ముఖ్యంగా ‘వడచెన్నై’ చిత్రంలో తనను చూసిన వారు ఈమె ఆండ్రియానేనా? అని ఆశ్చర్య పోతారని అంది. ఇకపై కూడా విభిన్న  పాత్రలనే పోషించాలని నిర్ణయించుకున్నానని, అలాంటప్పుడు ఇమేజ్‌ గురించి పట్టించుకోనని, ఎవరెలా విమర్శించినా   బాధలేదని అంటోంది.