ఇకపై క్వాలిటీ వర్క్‌ చేస్తానంటున్న ‘బిగ్‌బాస్‌’ విజేత శిల్పాషిండే

“ఇక ముందు రియాల్టీ షోలకు హోస్ట్‌గా చేయాలని ఉంది. గతంలోలాగా ఏది పడితే అది ఒప్పుకోకుండా… కాస్త క్వాలిటీ వర్క్‌ చేయాలనుకుంటున్నా…” అని అంటోంది ‘బిగ్‌బాస్‌’ విజేత శిల్పాషిండే. ‘బిగ్‌బాస్‌’  లో హీనాఖాన్‌, వికాస్‌ గుప్తా, పునీష్‌ శర్మలను వెనక్కి నెట్టి శిల్పాషిండే ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 11 విజేతగా నిలిచింది. 44 లక్షల రూపాయలతో పాటు ట్రోఫీని గెలుచుకుంది. షో ప్రారంభం నుంచి అనేక విమర్శలను, వివాదాలను ఎదుర్కొన్న శిల్పా చివరిదాకా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకుండా ధైర్యంగా పోరాడింది. ఒక టీవీ తారగా ఇంతకుముందు పరిశ్రమలో ‘లైంగిక వేధింపుల’పై గళమెత్తిన శిల్పా పోరాటపటిమే చివరకు ఆమెను ‘బిగ్‌బాస్‌’ విజేతగా నిలిపింది. ముంబయికి చెందిన శిల్పా షిండే టీవీ తారగా గుర్తింపు పొందారు. 1999లో కెరీర్‌ మొదలెట్టినప్పటికీ స్టార్‌ప్లస్‌లో ప్రసారమైన ‘భాభీ’ సీరియల్‌తో వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత ‘సంజీవని’, ‘అమ్రపాలి’ వంటి పలు సీరియళ్లలో ప్రధాన పాత్రలు పోషించారు. ‘భాభీజీ ఘర్‌ పర్‌ హై’లో ‘అంగూరీ భాభీ’గా ప్రసిద్ధి చెందారు. శిల్పా తండ్రి డాక్టర్‌ షిండే హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ముంబయిలోని కేసీ కాలేజీలో సైకాలజీలో డిగ్రీ చేసిన తర్వాత న్యాయశాస్త్రం చదవమని తండ్రి చెబుతున్నప్పటికీ శిల్ప దృష్టి నటనవైపు మళ్లింది. ఒక టీవీ షోలో సహనటుడైన రోమిత్‌ రాజ్‌తో చాలాకాలం సహజీవనం చేసి, అతడిని పెళ్లాడాలనుకున్నారు. అయితే 2009లో ఎంగేజ్‌మెంట్‌ అయిన తర్వాత ఇద్దరికీ సరిపడక విడిపోయారు. తెలుగులో వచ్చిన ‘చిన్నా’, ‘శివానీ’ సినిమాల్లో కూడా శిల్ప నటించారు.
గెలిచానంటే ఆ క్రెడిట్‌ ఒకే ఒక్కరికి ఇస్తా !
‘బిగ్‌బాస్‌’ విజేతనవుతానని అస్సలు ఊహించలేదు. మూడు నెలల క్రితం బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లినప్పుడు నా మనసులో ఒకటే ఆలోచన… నేను నేనుగానే ఉండాలని! రకరకాల మనుషులు, కోపాలు, వెక్కిరింపులు, ఎన్నో రకాల భావోద్వేగాలు. అయినా వాటన్నింటినీ తట్టుకుని నిలబడ్డాను. గత పది సీజన్లలో ట్రోఫీ పట్టుకున్నవారిని టీవీలో చూశాను కానీ ఈసారి ఆ ట్రోఫీ నేనే తీసుకుంటానని అనుకోలేదు. నిజంగా ఇది నా జీవితంలో మర్చిపోలేని అరుదైన సందర్భం. కలా? నిజమా? అనే షాక్‌లో ఉన్నాను. చివరిదాకా ధైర్యంగా నిలబడితే గెలుస్తాననే విశ్వాసం (అది అతివిశ్వాసం కాదనే విషయం నాకు తెలుసు) ఉండేది. చివరికి నా విశ్వాసమే నిజమైంది. సల్మాన్‌జీ స్టేజీ మీద నా చెయ్యి పైకెత్తి ‘శిల్పా’ అనగానే కాసేపు జోక్‌ చేస్తున్నారేమో అనుకున్నా. ఆ తర్వాత ఏడ్చేశా.
అంత మంది పాల్గొన్న ఈ పోటీలో గెలిచానంటే ఆ క్రెడిట్‌ ఒకే ఒక్కరికి ఇస్తా. అతడు మరెవరో కాదు సల్మాన్‌ఖాన్‌. నేను హౌస్‌లో ఉన్నప్పుడు చాలా విషయాలు నాకు అర్థమయ్యేవి కాదు. అలాంటి సమయంలో సల్మాన్‌ నాకు చాలా సాయం చేశారు. సపోర్టుగా నిలిచారు. దాంతో ఆయన నన్ను కాపాడుతున్నారని కామెంట్లు కూడా చేశారు. కానీ హౌస్‌లో నా తీరును ఆయన మొదట్నుంచీ చూస్తున్నారు. ఎవరికి ఏ మేరకు ధైర్యాన్ని, చేయూతనివ్వాలో ఆయనకు బాగా తెలుసు. హౌస్‌లో కొంతమంది నన్ను
టార్గెట్‌ చేసినప్పుడు కూడా సల్మాన్‌జీ నా వైపు నిలిచారు.
ఆ స్నేహాన్ని కొనసాగించాలనుకుంటున్నా !
వికాస్‌గుప్తాతో నేను చాలా క్లోజ్‌గా ఉన్న మాట వాస్తవమే. నాకు అంతకు మించి మరో ఆప్షన్‌ లేదు. అతడు కూడా నాతో స్నేహంగానే ఉన్నాడు. ఆ స్నేహాన్ని బయట కూడా అలాగే కొనసాగించాలనుకుంటున్నా. మా మధ్య జరిగిన కొన్ని అనివార్య సంఘటనలను అప్పుడే మర్చిపోయా. ఒక వెబ్‌ సిరీస్‌ చేస్తానని వికాస్‌కు ప్రామిస్‌ చేశా. కాబట్టి తప్పకుండా అతడితో కలిసి పనిచేస్తా.
ఇది ఆట కాబట్టి, అందరూ ఒకరికొకరు పోటీదారుగానే భావించాల్సి ఉంటుంది. ఆర్శీఖాన్‌ షో నుంచి బయటకు వెళ్లిన తర్వాత గానీ నేను ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నానో తెలుసుకోలేకపోయింది. హౌస్‌లో నేను చాలా ఓపికగా వంట చేసి పెట్టాను. తిండి విషయంలో అందరినీ ఒకేలా చూశాను. అందుకే నన్ను ‘మామ్‌’ అని పిలవడం మొదలెట్టారు. మనం ఏం చేస్తున్నా సరే దాన్ని దేవుడు ఓ కంట కనిపెడుతుంటాడని నమ్ముతా.
టీవీ సీరియళ్లు చేయకూడదనుకుంటున్నా!
 చాలా టీవీ సీరియళ్లలో నటించా. టీవీ నటిగా మారితే సమస్య ఏమిటంటే …పాపులరైనా పాత్రతోనే గుర్తు పెట్టుకుని ముద్ర వేస్తారు. ‘భాభీజీ ఘర్‌ పర్‌ హై’ సీరియల్‌లోని ‘అంగూరీ’ భాభీగానే నన్ను ఇప్పటికీ పిలుస్తున్నారు. అందుకే ఇక ముందు టీవీ సీరియళ్లు చేయకూడదనుకుంటున్నా. ‘బిగ్‌బాస్‌’ వల్ల నాకొక కొత్త ఇమేజ్‌ వచ్చింది. ఇక ముందు రియాల్టీ షోలకు హోస్ట్‌గా చేయాలని ఉంది. గతంలోలాగా ఏది పడితే అది ఒప్పుకోకుండా కాస్త క్వాలిటీ వర్క్‌ చేయాలనుకుంటున్నా. ఈ తీపి జ్ఞాపకాల్ని కొన్నాళ్లు ఆస్వాదించి, ఆ తర్వాత పని మొదలెడతా.
సాధారణంగా ఏ రంగంలోనైనా లైంగిక వేధింపుల గురించి మాట్లాడేందుకు మహిళలు ముందుకు రారు. ఎందుకంటే ధైర్యంగా మాట్లాడటం మొదలెట్టేసరికి వారిపై వ్యక్తిగత విమర్శలకు దిగుతారు. పవర్‌గేమ్‌లో కెరీర్‌ను దెబ్బతీసే ప్రయత్నాలు మొదలెడతారు. అందుకే ఇలాంటి ‘వైట్‌ కాలర్‌ మాఫియా’ను ఎదుర్కోవాలంటే చాలా ధైర్యం కావాలి. గతంలో నాకు ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు ధైర్యంగా పోరాడాను. పని పట్ల నిబద్ధత ఉంటే ఎవరేం చేయలేరు.