గుండు హనుమంతరావు కన్నుమూశారు !

ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు(61) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ ఉదయం 3.30 గంటల సమయంలో అనారోగ్యానికి గురైన ఆయన్ని కుటుంబసభ్యులు ఎర్రగడ్డలోని సెయింట్‌ థెరిసా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు డాక్టర్లు. 1956 అక్టోబర్ 10న విజయవాడలో ఆయన జన్మించారు. నాలుగు వందలకు పైగా సినిమాల్లో గుండు హనుమంతరావు నటించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తాను కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ తన అనారోగ్య విషయాన్ని ఎవరికీ తెలియజేయలేదన్నారు. దీంతో విషయం తెలుసుకున్న చిరంజీవి ఆయనకు ఆర్థిక సాయం అందించారు.
18ఏళ్ల వయసులో గుండు హనుమంతరావు నాటకరంగ ప్రవేశం చేశారు. నాటకాల్లో ఆయన వేసిన మొదటి వేషం రావణబ్రహ్మ. స్టేజీ షోలతో ఆయన చాలా పాపులర్‌ అయ్యారు. 400 సినిమాల్లో నటించిన గుండు హనుమంతరావు తొలి చిత్రం ‘అహ నా పెళ్లంట’. ఆయనకు బాగా పేరు తెచ్చిన సీరియల్ ‘అమృతం’. గుండు హనుమంతరావు మూడు సార్లు టీవీ నంది అవార్డులు అందుకున్నారు. ఆయన నటించిన చిత్రాలు..బాబాయి హోటల్‌, పేకాట పాపారావు, అల్లరి అల్లుడు, మాయలోడు, యమలీల, శుభలగ్నం, క్రిమినల్, అన్నమయ్య, సమరసింహారెడ్డి, కలిసుందాం రా, సత్యం, పెళ్లాం ఊరెళితే, అతడు, భద్ర, ఆట, మస్కా. గుండు హనుమంతరావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
హనుమంతరావు నీతినియమాలు ఉన్న వ్యక్తి !
గుండు హనుమంతరావు పార్థివదేహాన్ని ప్రముఖనటుడు బ్రహ్మానందం సందర్శించారు. హనుమంతరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. హనుమంతరావు కుటుంబానికి ఆయన ప్రగాడ సానుభూతిని తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హనుమంతరావు గొప్పతనాన్నివివరించారు. హనుమంతరావు నీతినియమాలు ఉన్న వ్యక్తి అని కొనియాడారు. హనుమంతరావు గురించి చెబుతూ బ్రహ్మానందం కన్నీటిపర్యంతమయ్యారు.
 ‘‘హనుమంతరావు మరణించారనే వార్త వినగానే అలజడి, వణుకు వచ్చింది. వెంటనే ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజాకు మూడు సార్లు ఫోన్ చేసి.. హనుమంతరావు మృతి చెందిన విషయాన్ని నిర్థారించుకున్నాను. తర్వాత హనుమంతరావు తమ్ముడు నాకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. ఆప్యాయతలో ఎలాంటి కల్మషం లేని నటుడు హనుమంతరావు. హనుమంతరావును చూసి ఇప్పుడు సినీ ఇండ్రస్టీలోకి వస్తున్న కొత్తతరం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తనకు సినిమాల్లో వేషాలు తగ్గినప్పుడు నిర్మాతకు కానీ.. దర్శకుడికి కానీ వేషం ఇప్పించాలని హనుమంతరావు అడిగిన సందర్భాలు లేవు. హనుమంతరావు ఆశయాలు ఉన్న గొప్ప నటుడు. తనకుంటూ ఓ శైలిని, ప్రత్యేకతను చాటుకునేవాడు. నాకు ఉన్న అతి తక్కువ మంది మిత్రుల్లో హనుమంతరావు ఒకరు’’ అని బ్రహ్మానందం కన్నీటి పర్యంతమయ్యారు.