రికార్డ్‌లను బ్రేక్‌ చేసిందీ పాట !

‘కేవలం 24 గంటల్లో ‘స్వాగ్‌ సే స్వాగత్‌’ పాటను కోటి మందికి పైగా వీక్షించడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ పాటలో నేను చేసిన డాన్స్‌కు మంచి అప్రిషియేషన్‌ లభిస్తోంది. అభిమానులైతే డాన్స్‌తో మెస్మరైజ్‌ చేశారంటూ అభినందనల వర్షం కురిపిస్తున్నారు’ అని ఆనందాన్ని వ్యక్తం చేసింది కత్రినాకైఫ్‌. సల్మాన్‌ఖాన్‌, కత్రీనాకైఫ్‌ జంటగా అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘టైగర్‌ జిందా హై’. ‘ఏక్‌ థా టైగర్‌’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈచిత్రంలోని ‘స్వాగ్‌ సే స్వాగత్‌’ సాంగ్‌ వీడియో క్లిప్‌ను చిత్రయూనిట్‌ ఇటీవల సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. రిలీజ్‌ చేసిన 24 గంటల్లోనే కోటి మందికి పైగా వీక్షించడంతోపాటు దాదాపు మూడు లక్షల లైక్స్‌ లభించాయి. ఇప్పటివరకు దాదాపు 2 కోట్ల మంది వీక్షించడంతో ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.

అంతేకాదు అంతర్జాతీయ ఆల్బమ్‌ల రికార్డ్‌ను సైతం బ్రేక్‌ చేసిందీ పాట. ముఖ్యంగా ఈ పాటలో సల్మాన్‌, కత్రినా వేసిన స్టెప్పులు అభిమానుల్నే కాదు ప్రేక్షకుల్ని సైతం విశేషంగా అలరిస్తున్నాయి. గ్రీస్‌లో తెరకెక్కించిన ఈ పాటలో వివిధ రకాల డాన్సుల్లో నిష్ణాతులైన 100 మంది డాన్సర్లు పాల్గొనడం విశేషం. కత్రినా ఈ చిత్రంతోపాటు ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’, ఆనంద్‌.ఎల్‌.రాయ్  తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ నటిస్తోంది.