ప్ర‌భాస్ ‘సాహో’లో పాప్ గాయ‌ని కైలీ మినోగ్‌ పాట?

ప్ర‌భాస్ రేంజ్ ‘బాహుబ‌లి’ సినిమా త‌ర్వాత ఏ స్థాయికి పెరిగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయన సినిమాల కోసం దేశ విదేశాల‌కి చెందిన సినిమా ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్’ సాహో’. స్పై థ్రిల్ల‌ర్‌గా ‘ర‌న్ రాజా ర‌న్’ ఫేం సుజీత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. శ్ర‌ద్ధా క‌పూర్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. చిత్రానికి సంబంధించి విడుద‌లైన వీడియోలు ప్రేక్ష‌కుల‌లో సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాయి.
 
దాదాపు 300 కోట్ల తో ‘సాహో’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తుండ‌గా ఇందులో నీల్‌ నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్, ఎవ్‌లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే వంటి టాప్ స్టార్స్‌ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. యాక్ష‌న్ స‌న్నివేశాల కోసం హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ ప‌ని చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో స్పెష‌ల్ సాంగ్ కోసం హాలీవుడ్ బ్యూటీని తీసుకువస్తున్నారట సాహో టీం. పాప్ గాయ‌నిగా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన ఆస్త్రేలియన్- బ్రిటీష్ భామ కైలీ మినోగ్‌.. ‘సాహో’లో స్పెషల్ సాంగ్ చేసేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. గతంలో అక్ష‌య్ న‌టించిన ‘బ్లూ’ సినిమాలో స్పెష‌ల్ సాంగ్ చేసింది. దాదాపు ప‌దేళ్ళ త‌ర్వాత ఆమె మ‌ళ్లీ ఇండియ‌న్ సినిమా చేసేందుకు సిద్ధ‌మైంది కైలీ మినోగ్‌.