నా కొడుకుకి వారసత్వంగా క్రికెట్ పట్ల ప్రేమను పెంచుతా !

క్రికెట్ అనేది మన రక్తం, నరనరాల్లో జీర్ణించుకుని పోయిందని హీరో ఎన్టీఆర్ అన్నారు. ఐపీఎల్ తెలుగు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్ నియమితులయ్యారు. నగరంలో జరిగిన ప్రమోషన్ ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘‘క్రికెట్‌ను ఆస్తి లాగా పెద్దలు పిల్లలకు వారసత్వంగా ఇస్తున్నారు. క్రీడలు ఒక లాంగ్వేజ్‌లాగా కూడా పనికొస్తాయి. క్రీడల ద్వారానే ఒకరికొకరు అర్థమయ్యేలా మాట్లాడుకోగలుగుతున్నారు.
భారత దేశంలో క్రీడలపట్ల ప్రేమ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా క్రికెట్ మన రక్తం, నరనరాల్లో జీర్ణించుకుపోయింది. తండ్రులు ఆస్తులు పంచినట్లు క్రికెట్‌ పట్ల ప్రేమను కూడా మనకు వారసత్వంగా పంచారని గట్టిగా నమ్ముతాను. మా నాన్న ఎంతో ఇష్టంగా క్రికెట్‌ను చూసేవారు. ఆయన చూడటం దగ్గర నుంచి నేను క్రికెట్ పట్ల ఆ ప్రేమను పెంచుకోవడం జరిగింది. నేను నా కొడుకుకి వారసత్వంగా క్రికెట్ పట్ల ప్రేమను పెంచుతా.
 ఇది కేవలం ఒక్క భారతదేశంలో ఇంతగా క్రికెట్‌ని ఆస్వాదించడం జరుగుతుంది. అలాంటి ఒక కొత్త డైమన్షన్‌ని క్రియేట్ చేసింది ఐపీఎల్. అలాంటి ఒక కొత్త డైమన్షన్‌కి తెలుగుభాషలో దాని కామెంట్రీ చేస్తే, స్టార్ మా మూవీస్‌లో దాన్ని టెలికాస్ట్ చేసేటప్పుడు నన్ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నుకున్నందుకు నిజంగా ‘స్టార్ ఇండియా’ వారికి నా కృతజ్ఞతలు. నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.’’ అని అన్నారు.