అందులో నన్ను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు!

“సినిమాల్లో ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలకు ఇది భిన్నమైనదని చెప్పగలను. ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు’’ అని అంటోంది సమంత. డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లోకి సమంత అడుగుపెట్టారు. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌ సెకండ్‌ సీజన్‌లో సమంత నటించనున్నారు. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి, నీరజ్, శరద్ కేల్కర్ ప్రధాన పాత్రలు పోషించిన `ఫ్యామిలీ మేన్` తొలి సీజన్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది.ఫస్ట్‌ సీజన్‌ విజయవంతం కావడంతో రెండో సీజన్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లారు. మధ్య తరగతికి చెందిన ఓ వ్యక్తి కేంద్ర దర్యాప్తు సంస్థకు ఇంటిలెజెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. ఆ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రాజ్ నిడమోరు, కృష్ణ డీకే రూపొందించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ కు మంచి ఆదరణ లభించింది. ఇక ఈ సిరీస్‌ రెండో సీజన్‌లో సమంత కీలక పాత్ర పోషించబోతోందని రాజ్ నిడమోరు, కృష్ణ డీకే వెల్లడించారు.
 
‘‘డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బాగా దూసుకెళ్తోంది. ఇందులో నా భాగస్వామ్యం కూడా ఉండాలనుకుంటున్నాను. రాజ్‌ అండ్‌ డీకే రాసిన స్క్రిప్ట్‌ బాగుంది. డిజిటల్‌ మీడియంలోకి నా ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఇంత కన్నా బెటర్‌ పార్ట్‌నర్స్‌ ఎవరు ఉంటారు. సినిమాల్లో నేను చేసిన పాత్రలకు ఇది భిన్నమైనదని చెప్పగలను. ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు’’ అన్నారు సమంత.
కొత్త కథలకు వెంటనే ఓకే
పెళ్లి తరువాత కూడా సమంతను గ్లామర్‌ పాత్రల్లో చూడటానికి ఆమె అభిమానులు రెడీగానే ఉన్నారు. అయితే,నటనకు అవకాశం ఉన్న భిన్నమైన పాత్రల్లో నటించాలని సమంత నిర్ణయానికి వచ్చింది. ఆ విధంగా ‘యూటర్న్’, ‘మజిలీ’, ‘ఓ బేబీ’ వంటి చిత్రాల్లో నటించింది. వాటిని ప్రేక్షకులు ఆదరించడంతో సమంతలో ఆత్మ విశ్వాసం మరింత పెరిగింది. దీంతో, ఇకపై తనకు నచ్చిన పాత్రల్లోనే నటించాలని గట్టిగా నిర్ణయించుకుందట. తమిళ సూపర్‌ హిట్‌ ’96’ తెలుగు రీమేక్‌లో త్రిష పోషించిన ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం తరువాత మరే కొత్త చిత్రాన్ని కమిట్‌ కాలేదు. వస్తున్నవి అన్నీ సాదా సీదా పాత్రలే కావడంతో నిరాకరిస్తున్నట్లు సమాచారం. దీంతో, కొత్తగా ఆలోచించాలని దర్శక, రచయితలకు సూచనలు ఇస్తోందట. వైవిధ్యంతో కూడిన కథలతో వస్తే వెంటనే ‘ఓకే’ చేస్తానని చెబుతోందట.