వీజే రెడ్డి ‘నెల్లూరి పెద్దారెడ్డి’ ఆడియో విడుదల

సిద్ధి విఘ్నేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దర్శకులు వీజే రెడ్డి రూపొందిస్తున్న చిత్రం నెల్లూరి పెద్దారెడ్డి. సీహెచ్ రఘునాథ రెడ్డి నిర్మాత. సతీష్ రెడ్డి, మౌర్యాని, ముంతాజ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రభాస్ శీను, అంబటి శీను, సమ్మెట గాంధీ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గురురాజ్ సంగీతాన్ని అందించిన నెల్లూరి పెద్దారెడ్డి ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ దర్శకులు సాగర్, రేలంగి నరసింహారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆడియో బిగ్ సీడీని ఆవిష్కరించిన అనంతరం…
దర్శకులు వీజే రెడ్డి మాట్లాడుతూ…
పల్లె వాతావరణంలో ఆహ్లాదకరమైన కథా కథనాలతో నెల్లూరి పెద్దారెడ్డి చిత్రం సాగుతుంటుంది. నెల్లూరు నుంచి ఖమ్మం జిల్లా సీతారాంపురం అనే గ్రామానికి వలస వచ్చిన పెద్దారెడ్డి అనే వ్యక్తి కథ ఇది. అలా అతన్ని అంతా నెల్లూరి పెద్దారెడ్డి అని పిలుస్తుంటారు. ఆ గ్రామంలోని వాళ్లంతా నెల్లూరి పెద్దారెడ్డిని గౌరవిస్తుంటారు. నలుగురికి మంచి చేసే పెద్దారెడ్డి ఓ యువతి కుటుంబానికి ఆశ్రయమిస్తాడు. ఈ క్రమంలో అతనికి అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. వాటి పర్యవసానంగా కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరంగా చూపిస్తున్నాం. కథలో కొన్ని సన్నివేశాలు విషాధంగా సాగుతుంటాయి. వాటిని సమతూకం చేసేందుకు ‘జబర్దస్త్’ శాంతి స్వరూప్ లాంటి నటులతో ‘చింతామణి’ నాటక రిహార్సల్స్ సన్నివేశాలు రూపొందించాం. ఈ ఎపిసోడ్ అంతా ప్రేక్షకులను బాగా నవ్విస్తుంటుంది. ఇలా అన్ని రకాల భావోద్వేగాలతో నెల్లూరి పెద్దారెడ్డి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. గురురాజ్ సంగీతం, డాక్టర్ కమలాకర కామేశ్వరరావు సాహిత్యం చక్కగా కుదిరాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలూ పూర్తి కావొస్తున్నాయి. రెండు మూడు రోజుల్లో ఫస్ట్ కాపీ సిద్ధమవుతుంది. సెన్సార్ పూర్తవగానే ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకొస్తాం. ఫిబ్రవరిలో నెల్లూరి పెద్దారెడ్డి చిత్రాన్ని విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు.
కథానాయకుడు సతీష్ రెడ్డి మాట్లాడుతూ…..నెల్లూరి పెద్దారెడ్డి అనే పాత్ర పేరు ప్రేక్షకులు వినే ఉంటారు. ఆ పెద్దారెడ్డి నవ్విస్తే….ఈ నెల్లూరి పెద్దారెడ్డి మీకు మర్చిపోలేని అనుభూతిని అందిస్తాడు. ఇంత గొప్ప పాత్రను నాకు ఇచ్చిన దర్శకులు వీజే రెడ్డి గారికి కృతజ్ఞతలు. ప్రణాళిక ప్రకారం కేవలం 28 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాం. నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తవుతున్నాయి. త్వరలోనే మీ ముందుకొస్తాం. మంచి చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం అన్నారు.
దర్శకులు సాగర్ మాట్లాడుతూ…..నెల్లూరి పెద్దారెడ్డి గురించి సినిమా తెలుసుకున్న తర్వాత మంచి అవగాహనతో ఈ సినిమా రూపొందించారని అర్థమవుతోంది. ఇవాళ్టి దర్శక నిర్మాతలకు కావాల్సింది అదే. ఏ కథ చెబుతున్నాం, దాన్ని ఎలా తెరకెక్కిస్తున్నాం అనేది కావాలి. దర్శకుడు వీజే రెడ్డి పూర్తి సన్నద్ధతతో ఈ చిత్రాన్ని రూపొందించారని తెలుస్తోంది. మంచి చిత్రం చేయడం కోసం ఆర్నెళ్లు, ఏడాది అయినా వేచి చూడండి కానీ…ఏదొకటి చేసేద్దాం అనుకోవద్దు. అలాంటి సినిమాలు తెరకెక్కించడం వల్ల ఎవరికీ లాభముండదు. ఈ చిత్ర యూనిట్ అందరికీ నా ఆశీస్సులు ఉంటాయి అన్నారు.
దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ….మేము సినిమాలు చేసేప్పుడు ప్రారంభోత్సవం మాత్రమే మాకు తెలుసు. చిత్రీకరణ సమయంలోనే పంపిణీదారులు సినిమా తీసుకునేవారు. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. ప్రతి దశలో సినిమా ఖర్చు నిర్మాతే భరించాల్సి వస్తోంది. నెల్లూరి పెద్దారెడ్డి చిత్రాన్ని నెల రోజుల్లోనే చిత్రీకరించడం గొప్ప విషయం. నేను నెలరోజుల్లో రూపొందించిన సినిమాలెన్నో శత దినోత్సవాలు జరుపుకున్నాయి. ఎంత బాగా కథను చెప్పామనేది ప్రేక్షకులకు కావాల్సింది. ఆ వినోదాన్ని నెల్లూరి పెద్దారెడ్డి అందిస్తుందని నమ్ముతున్నాను. అన్నారు.
 
నెల్లూరి పెద్దారెడ్డి చిత్రానికి మాటలు – సంజీవ్ మేగోటి, సినిమాటోగ్రఫీ – బాలసుబ్రహ్మణి, ఎడిటింగ్ – మేనగ శీను, సంగీతం – గురురాజ్, డాన్స్ – గోరా మాస్టర్.