అడవి నేపథ్యంలో చీకటి కోణాలను చూపే ‘నల్లమల’

న‌ల్ల‌మ‌ల‌… అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా రవి చరణ్ ‌దర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఆర్‌.ఎమ్‌ నిర్మిస్తున్న ఈ మూవీలోని సిద్ శ్రీ‌రామ్ పాడిన “ఏమున్న‌వే పిల్లా” సాంగ్ మిలియ‌న్స్ కి పైగా వ్యూస్ సాధించి సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఆ పాట‌కు ల‌క్ష‌కు పైగా క‌వ‌ర్‌సాంగ్స్ రావ‌డం విశేషం. ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు దేవా కట్టా విడుదల చేశారు.

దేవాకట్టా మాట్లాడుతూ.. ‘ఏమున్నావే పిల్ల‌” పాటను నేను నా ఫ్రెండ్స్‌తో హ్యాంగవుట్‌లో ఉంటే వింటాను. ఇలాంటి పాట నాకు ఒక్కటి కూడా లేదు అని అసూయ పడ్డాను.  అమిత్‌ను మొదటిసారి చూసినప్పుడే అన్నాను. ఇంత మంచి యాక్టర్‌వి, ఎందుకు అంత తక్కువగా కనిపిస్తున్నావ్ అని అన్నాను. మంచి క్యాస్టింగ్‌ను పెట్టుకోవడంతోనే సినిమా సక్సెస్‌కు మొదటి మెట్టు పడ్డట్టు అయింది. ఈ సినిమా వండ‌ర్స్ క్రియేట్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నాను’ అని అన్నారు.

ద‌ర్శ‌కుడు రవి చరణ్ మాట్లాడుతూ.. ‘నాతో ఈ సినిమా చేసినందుకు, నేను ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడేలా చేసిన నిర్మాత ఆర్ఎమ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఓ రెండు విషయాలు చెబుతాను. అడవిని ‘అడవి తల్లి’.. గోవును ‘గోమాత’ అని అంటాం. బానిస బతుకుల నుంచి భారతదేశం స్వేచ్చా ఆయువును పీల్చుకుంటున్న సమయంలో నల్లమల అడవుల్లోకి మానవ రూపంలో ఉన్న క్రూరమృగం ఎంట్రీ అయింది. ఆ మృగం ఎంట్రీ అయ్యాక ఏం జరిగింది అనేదే  ఈ కథ. ఈ సినిమా కోసం పని  చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు పీఆర్ మాట్లాడుతూ.. ‘ ఈ సినిమాలోని సాంగ్ ఫస్ట్ టైం డైరెక్టర్ గారు విన్నారు. ఆ తరువాత నేను విన్నాను. అప్పుడు ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. ‘ఏమీ సాధించలేరు’ అని అన్న వారికి ఆ సాంగ్‌తో సమాధానం చెప్పినట్టు అయింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడికి జీవితాంతం రుణ పడి ఉంటాను’ అని అన్నారు.
న‌టుడు అమిత్ మాట్లాడుతూ.. ‘ మొదటిసారి ఈ కథ విన్నప్పుడే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నాకు ఏ విలన్ కారెక్టర్ ఇస్తారో.. ఏ కారెక్టర్ ఇస్తారో అని అనుకున్నాను. నా మైండ్‌లో అలానే ఉంది. ఇందులో నా పాత్ర ఏంటి అని అడిగాను. హీరో మీరే అని అన్నారు. ఆ మాటతో నేను షాక్ అయ్యాను. కానీ ఈ సినిమాకు నేను హీరో కాదు… కథే ఈ చిత్రానికి హీరో. ఈ సినిమాకు అన్నీ మా దర్శకుడు రవి చరణ్ గారే. ఆయన ఎంత కష్టపడ్డారో కళ్లారా చూశాను. నన్ను ఈ సినిమాలో హీరోగా పెట్టుకున్నందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను`అన్నారు.
భాను శ్రీ‌ మాట్లాడుతూ.. ‘దర్శకుడు రవి చరణ్‌కు నేను మొదటగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు పల్లెటూరి పిల్లలా ఉండటం చాలా ఇష్టం. ఇలాంటి పాత్ర నాకు వస్తుందని ఊహించలేదు. ఇది నాకు పెద్ద అవకాశం. నల్లమల సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన పాట చాలా పెద్ద హిట్ అయింది. ఎక్కడికి వెళ్లినా ఆ పాటతోనే నన్ను గుర్తిస్తున్నారు. అంత మంచి పాట ఇచ్చినందుకు మ్యూజిక్ డైరెక్టర్‌కు థ్యాంక్స్. టీజర్ అద్భుతంగా ఉంది. కెమెరామెన్ వేణు మురళి నన్ను చాలా ఆనందంగా చూపించారు ’`అన్నారు.