ముందు ముందు హాలీవుడ్‌లోనే సెటిలైపోతానేమో ?

హాలీవుడ్ మోజులో ప్రియాంక పడిపోయిందనీ, ఆమె తిరిగి బాలీవుడ్‌లోకి రావడం అంత సులువు కాదని చెబుతున్నారు. బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ససేమిరా అనేస్తోందట ప్రియాంకా చోప్రా. గత ఏడాది ఈ బ్యూటీ… “ఈ ఏడాది పూర్తిగా బాలీవుడ్‌పైనే ఫోకస్ పెడతా…”అని పలు ఇంటర్వూలో చెప్పింది. కానీ ఇప్పుడు మాత్రం హిందీ సినిమాల్లో నటించేందుకు  అంతగా ఆసక్తి చూపడం లేదని బాలీవుడ్ సినీ జనాలు అంటున్నారు.

‘క్వాంటికో’ టివి సీరీస్‌తో హాలీవుడ్ ప్రేక్షకులకు ఈ భామ దగ్గరైంది. ఆతర్వాత ఆమె  ‘బేవాచ్’ సినిమా చేసింది. ‘క్వాంటికో’ పుణ్యమా అని తనకు బాలీవుడ్‌లోకన్నా హాలీవుడ్‌లోనే ఎక్కువ పాపులారిటీ దక్కిందని  మురిసిపోతున్నట్టుంది. హాలీవుడ్‌లో ఎంట్రీ ఎంత కష్టమో… అక్కడ నిలదొక్కుకోవడం అంతకన్నా కష్టం. లక్కీగా ప్రియాంకకు అక్కడ మంచి గుర్తింపే లభిస్తోంది. ముందు ముందు హాలీవుడ్‌లోనే సెటిలైపోవాలనిపించేంతలా అక్కడి వాతావరణం తనకు నచ్చిందటూ ప్రియాంక తాజాగా చేసిన వ్యాఖ్యలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. మరోపక్క ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు ఈ భామ డేట్స్ కోసం వెళ్తే… “ప్రస్తుతానికైతే డేట్స్ ఖాళీగా లేవు. హాలీవుడ్‌లో సినిమాలతో బిజీగా ఉన్నాను” అని ప్రియాంక సమాధానమిస్తోందట.  దాంతో ఆ నిర్మాతలు నిరాశకు గురవుతున్నారట.

ఈ పురస్కారాలతో మరింత సేవ చేసే శక్తి రావాలి !

ప్రియాంక చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. బరేలీ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ ప్రియాంకను డాక్టరేట్‌తో సత్కరించబోతోంది. తన స్వస్థలమైన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో  ప్రియాంక ఈ డాక్టరేట్‌ను అందుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక తల్లి మధు చోప్రా మాట్లాడుతూ….

‘ప్రియాంక చేస్తున్న సామాజిక సేవలు, ఇతర సేవా కార్యక్రమాలకు గానూ ఇలాంటి అవార్డులు, సత్కారాలు లభించడం చాలా సంతృప్తినిస్తుంది. తాజాగా డాక్టరేట్‌ రావడం ఆనందంగా ఉంది. ఈ అవార్డుకు ప్రియాంక అర్హురాలిగా భావిస్తున్నాను. ఈ పురస్కారాలతో ప్రియాంకకు మరింత సేవ చేసే శక్తి రావాలి’ అని తెలిపింది. విద్య, వైద్యం, బాలికలకు విద్య అందించే లక్ష్యంతో ప్రియాంక ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. అలాగే యునిసెఫ్‌ అంతర్జాతీయ సౌహార్ద రాయబారిగానూ కొనసాగుతున్నారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో ‘ఏ కిడ్‌ లైక్‌ జేక్‌’, ‘ఈజ్‌నాట్‌ ఇట్‌ రొమాంటిక్‌?’ చిత్రాల్లో నటిస్తోంది.