‘మణికర్ణిక’ కళ్లలోవాడి! … ముఖంలో రాజసం!!

క్రిష్‌ దర్శకత్వంలో బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘మణికర్ణిక’. ‘ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ అనేది ఉపశీర్షిక. ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరుగుతోన్న ఈ సినిమా షెడ్యూల్‌ మంగళవారం కంప్లీట్‌ అయ్యింది. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోలు ఆ షెడ్యూల్‌లోనివే. చిత్రబృందం అధికారికంగా విడుదల చేసినవి కాదు. ఎలాగో బయటికొచ్చాయి……

ఒరలో ఉన్న కత్తి వాడి కనిపించడం లేదు. కానీ, కళ్లలో వాడి కనిపిస్తోంది. ముఖంలో రాజసం ఉట్టిపడుతోంది. ఆహార్యం అదిరిపోయేలా ఉంది. ఇదంతా ఫొటోలో మీరు చూస్తున్న మణికర్ణిక గురించే.

 కంగనా గెటప్‌ అదిరిపోయింది కదూ! నెక్ట్స్‌ షెడ్యూల్‌ జోద్‌పూర్‌లో జరగనుందట. ‘బాహుబలి’, ‘భజరంగీ భాయిజాన్‌’ వంటి హిట్‌ చిత్రాలకు కథ అందించిన విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమాకు కథ అందించారు. శంకర్‌– ఎహసాన్‌–లాయ్‌ త్రయం స్వరకర్తలు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 27న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘క్వీన్‌’ తర్వాత కంగనాకు ఆ స్థాయిలో పేరు తెచ్చిపెట్టే చిత్రమవుతుందనే అంచనాలున్నాయి.

హాలీవుడ్‌ టీమ్‌ 30… లోకల్‌ ఫైటర్స్‌ 300…

‘మణికర్ణిక’… ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవితకథతో దర్శకుడు క్రిష్‌ రూపొందిస్తున్న చిత్రమిది. లక్ష్మీభాయ్‌ అంటేనే యుద్ధాలు, గుర్రపు స్వారీలు…. ఆ యుద్ధాలు తెరకెక్కించడం కోసం నిక్‌ పావెల్‌ అనే హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ను రప్పించారు క్రిష్‌. ‘గ్లాడియేటర్‌’ వంటి హాలీవుడ్‌ హిట్‌ సిన్మాలకు నిక్‌ వర్క్‌ చేశారు. ఆయన చేత స్వోర్డ్‌ ఫైటింగ్, హార్స్‌ రైడింగ్‌ తదితర అంశాల్లో కంగనాకు శిక్షణ ఇప్పించారనే సంగతి తెలిసిందే. ఇంకో ఇంట్రెస్టింగ్‌ మేటర్‌ ఏంటంటే… కంగనాకే కాదు, హైదరాబాద్‌ లోకల్‌ ఫైటర్స్‌కూ నిక్‌ పావెల్‌ టీమ్‌ చేత ట్రైనింగ్‌ ఇప్పించారట.

అందుకోసం, హాలీవుడ్‌ నుంచి 30 మంది స్పెషల్‌ టీమ్‌ వచ్చారట. ఎందుకంటే… వార్‌ సీక్వెన్సులను వీలైనంత లైవ్‌లో షూట్‌ చేయాలనుకుంటారు క్రిష్‌. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ షూటింగును అలానే చేశారు. ఇప్పుడీ సిన్మాకు సేమ్‌ థియరీ ఫాలో అవుతున్నారట. ఆమధ్య  ముప్పైరోజులు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ‘మణికర్ణిక’ కోసం యుద్ధ సన్నివేశాలు తీశారు.  300 మంది లోకల్‌ ఫైటర్స్, మరికొందరు జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఈ వార్‌ సీక్వెన్స్‌ కోసమే లోకల్‌ ఫైటర్స్‌ కు ట్రైనింగ్‌ ఇప్పించారు.