రఘువీర్‌ చౌదరికి ఎన్టీఆర్‌ సాహితీ పురస్కారం

సాహిత్యం లేనిదే సంగీతం లేదని, ఈ రెండూ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావు చెప్పారు. పూర్వజన్మ సుకృతంవల్లే సాహిత్యం, సంగీతం అబ్బుతాయన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో ప్రఖ్యాత గుజరాతీ రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ప్రొఫెసర్‌ రఘువీర్‌చౌదరికి ఎన్టీఆర్‌ జాతీయ సాహితీ అవార్డును ప్రదానం చేశారు. ఎన్టీరామారావు జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్‌ ట్రస్టు నిర్వహించిన ఈ ప్రదానోత్సవంలో జస్టిస్‌ శివశంకరరావు మాట్లాడుతూ… దేశ సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యాన్ని మనం గుర్తించలేకపోతున్నామని, వాటిని విదేశీయులు దోచుకొంటున్నారని అన్నారు. పౌరాణిక, జానపద చిత్రాలతో ఎన్టీఆర్, ఎస్వీఆర్‌ వంటి మహానటులు మన సంస్కృతికి పెద్దపీట వేశారన్నారు.

బిహార్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి మాట్లాడుతూ… తెలుగు జాతి పట్ల భక్తిభావం, గౌరవం పెరగాలంటే ఎన్టీఆర్‌ చిత్రాలు చూడాలన్నారు. నేడు సమాజంలో విలువలు ఉన్నాయంటే ఎన్టీఆర్‌ చిత్రాలే కారణమన్నారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ… తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్‌ అని కొనియాడారు. ‘సాక్షి’ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ… నిస్వార్థం, చిత్తశుద్ధితో సామాన్యుల బాగోగులు తెలుసుకున్న రాజకీయ నాయకులు ఎన్టీఆర్, వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాత్రమేనన్నారు. 21 ఏళ్లుగా సాహితీ కార్యక్రమాల్ని సంకల్పం, ఆత్మవిశ్వాసంతో నిర్వహిస్తూ, ప్రతిభావంతులకు అవార్డులు ఇవ్వడం ఆనందంగా ఉందని ఎన్టీఆర్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి చెప్పారు. నటి గీతాంజలి, అవార్డు కమిటీ సభ్యులు ఓల్గా, సి.మృణాళిని, మాణిక్యాంబ పాల్గొన్నారు.

ఈ అవార్డు ప్రత్యేకం: రఘువీర్‌చౌదరి
ఎన్ని అవార్డులు వచ్చినా… ఎన్టీఆర్‌ సాహితీ పురస్కారాన్ని అందుకోవడం ప్రత్యేకమని, ఆనం దంగా ఉందని అవార్డు గ్రహీత రఘువీర్‌చౌదరి చెప్పారు. సినిమాలు, రాజకీయాల్లో సామాన్య ప్రజలకు దగ్గరగా ఉన్నది ఎన్టీఆర్‌ ఒక్కరేనన్నారు.