గాసిప్ లపై పోరాటంలో విజయ్ దేవరకొండ కు మహేష్ మద్దతు!

విజయ్ దేవరకొండ కరోనా లాక్ డౌన్ సమయంలో అవసరంలో ఉన్న మధ్య తరగతి ప్రజల కోసం.. ‘దేవరకొండ ఫౌండేషన్’ పేరు మీద సహాయ నిధి ఏర్పాటు చేసి సహాయం అందిస్తున్నారు. విజయ్ దేవరకొండ పై కొన్ని వెబ్ సైట్లు చేసిన నిరాధార ఆరోపణలను ఖండిస్తూ… విజయ్ ఒక వీడియో ను విడుదల చేసారు. తమ స్వంత అజెండా తో ఆరోపణలు చేసే ఇలాంటి తప్పుడు వార్తలను, గాసిప్ వెబ్ సైట్లను నమ్మొద్దని, వాటికి దూరంగా ఉండాలని వీడియోలో తెలిపారు.
 
విజయ్ దేవరకొండ పిలుపు కు స్పందించిన సూపర్ స్టార్ మహేష్, ఈ విషయంలో విజయ్ దేవరకొండ కు మద్దతు తెలుపుతూ తన సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు…..
 
ఒక స్థాయికి చేరుకోవాలంటే ఎన్నో సంవత్సరాల కృషి, కష్టం, ఓర్పు, ఎన్నో త్యాగాలు ఉంటాయి. అంత కష్టపడితే కానీ ప్రజాభిమానం పొందలేము. భార్యకు బాధ్యత గల భర్తగా, పిల్లలకు స్ఫూర్తినిచ్చే ఒక సూపర్ హీరో వంటి తండ్రిగా, ఎంతగానో ప్రేమించే అభిమానులకు ఆదర్శవంతమైన సూపర్ స్టార్ గా బాధ్యత నిర్వర్తించాలంటే ఎంతో నిబద్ధతతో పని చేయాలి.
 
ఎవరో పేరు కూడా తెలియని వ్యక్తి డబ్బు కోసం అగౌరవపరిచేలా, నిరాధార వార్తలు రాసి ఆ అబద్ధాలను వాటిని చదివే ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదు.
మన తెలుగు సినిమా ఇండస్ట్రీనీ, నా ఫ్యాన్స్ ను, నా పిల్లలను ఈ అబద్ధపు వార్తల నుండి కాపాడుకోవాలనుకుంటున్నాను. ఈ ఫేక్ వెబ్ సైట్ల మీద చర్యలు తీసుకోవాలని.. కలిసికట్టుగా వీటిని అరికట్టాలని, ఇందు కోసం అందరం ముందుకు రావాలని పిలుపునిస్తున్నాను
 
మహేష్ మద్దతుకు విజయ్ దేవరకొండ కృతజ్ఞతలు తెలిపి “మనమంతా ఒకటే… ఈ అసత్య వార్తలను ఎదుర్కునే టైమ్ వచ్చింది” అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి మద్దతు!
విజయ్ దేవరకొండకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలిపారు. తన కుటుంబం కూడా బాధ్యతలేని రాతల వల్ల బాధపడిన సందర్భాలు ఉన్నాయని ట్వీట్ చేశారు. విజయ్‌కు మద్దతుగా ఉంటామన్న ఆయన.. నిరుత్సాహపడొద్దని సూచించారు. వ్యక్తిగత అభిప్రాయాలను వార్తలుగా మార్చొద్దని జర్నలిస్టులను ఆయన కోరారు. #KillFakeNews అనే హ్యాష్ ట్యాగ్ కూడా తన ట్వీట్‌కు జత చేశారు. తన ఆధ్వర్యంలోని ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవా కార్యక్రమాలపై ఓ వెబ్ సైట్‌లో ఫేక్ వార్తలు రావడంపై కలత చెందిన విజయ్ దేవరకొండ సంచలన వీడియో విడుదలచేశారు. ఇది ఇండస్ట్రీలో తీవ్ర కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఆ ఫేక్ వార్తలను ఖండించిన విజయ్.. ఆ వెబ్ సైట్ తీరును తూర్పరాబట్టారు. విజయ్‌కు సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. రవితేజ, కొరటాల శివ, హరీష్ శంకర్, అనిల్ సుంకర, వంశీ పైడిపల్లి, క్రిష్ జాగర్లమూడి, మధుర శ్రీధర్, రానా దగ్గుబాటి, బీవీఎస్ రవి, రాశీ ఖన్నా వంటి వారందరూ విజయ్ దేవరకొండకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు.