పరీక్ష తప్పిన …. ‘ఎంసిఏ’ ( మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌) చిత్ర సమీక్ష

0
364
                                             సినీవినోదం  రేటింగ్ : 2.5/5
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పై శ్రీరామ్‌ వేణు దర్శకత్వం లో రాజు, శిరీష్‌, లక్ష్మణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు
 
చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో నాని(నాని)ని పెంచి పెద్ద చేస్తాడు..అతని అన్నయ్య(రాజీవ్‌ కనకాల). ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంటుంది. అన్నయ్యకు జ్యోతి(భూమిక) అనే అమ్మాయితో పెళ్లవుతుంది. జ్యోతి రాకతో అన్నయ్య దగ్గర తనకు ప్రాధాన్యత తగ్గుతోందని … అందుకు కారణం తన వదినే అని నాని అనుకుంటాడు. అందుకని హైదరాబాద్‌లోని తన పిన్ని వాళ్లింట్లో కొన్ని రోజులు ఉంటాడు. అదే సమయంలో ఆర్‌.టి.ఒ ఆఫీసర్‌ అయిన జ్యోతికి వరంగల్‌కు ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. అన్నయ్య ఢిల్లీలో ట్రైనింగ్‌కు వెళ్లడంతో..అన్నయ్య కోసం వదినతో పాటు వరంగల్‌ చేరుకుంటాడు నాని. అక్కడే పల్లవి(సాయిపల్లవి)ని చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. కథ ఇలా సాగే క్రమంలో…. వరంగల్‌లో శివశక్తి ట్రావెల్స్‌ అధినేత శివ(విజయ్‌ వర్మ) బస్సులన్నీ అక్రమంగా నడుస్తున్నాయని జ్యోతి సీజ్‌ చేస్తుంది.దాంతో జ్యోతిపై కక్ష కట్టిన శివ, అతని మనుషులు ఆమెను చంపే ప్రయత్నం చేస్తుంటారు. అదే సమయంలో వదిన మంచితనం తెలుసుకున్న నాని ఆమెను కాపాడుకుంటాడు. అయితే జ్యోతిని పదిరోజుల్లో చంపేస్తానని..అలా చంపకుంటే ఆమెను ఏమీ చేయకుండా వదిలేస్తానని నాని దగ్గర ఛాలెంజ్‌ చేస్తాడు శివ. అలాగే ఈ పదిరోజులు తన వదినను కాపాడుకుంటానని శివ దగ్గర ఛాలెంజ్‌ చేస్తాడు నాని. ఈ పోటీలో ఎవరు గెలుస్తారు? ఆ క్రమంలో నానికి ఎదురైన సవాళ్లేంటి? శివ నుండి తన వదినను నాని ఎలా కాపాడుకుంటాడు? నాని, పల్లవి ఒకటవుతారా? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాలి ….
 
వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని, దిల్ రాజుల నుండి…ప్రేక్షకులని ‘ఫిదా’ చేసిన నాయిక సాయి పల్లవి తో కలిసి వచ్చిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ పై మంచి అంచనాలే ఉన్నాయి. హిట్ చిత్రానికి కావాల్సిన హంగులన్నీ బాగా కుదిరినా ఈ ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌’ లో ప్రేక్షకులను మెప్పించే ‘విషయం’ మాత్రం మిస్‌ అయింది. ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ నాని. మిడిల్ క్లాస్ కుర్రాడిలా నాని నటన చాలా బాగుంది. అతనికి తోడుగా టాలెంట్‌కి ఏమాత్రం లోటు లేని సాయి పల్లవి వుండడంతో ప్రథమార్ధాన్ని ఈ జంటే దాదాపుగా నిలబెట్టేసింది. అయితే ‘విషయం’ లేని సెకండ్‌హాఫ్ లో నాని, సాయి పల్లవి కూడా ఏమీ చేయలేకపోయారు.విలన్‌ ఎంటర్‌ అయ్యే సరికి కథే మారిపోయింది. అంతవరకు వున్న వినోదం పోయి యాక్షన్‌ మలుపు తీసుకున్న సినిమాని నడిపించడం దర్శకుడి వల్ల కాలేకపోయింది. కథనంలో బలహీనత కొట్టొచ్చినట్టు బయటపడటంతో ఇక ‘బయటకి పోవచ్చు’ అని విసిగిపోయేంతగా బోర్ కొట్టేసింది. ప్రథమార్ధం లో వినోదం మీద ఫోకస్‌ చేసిన విధం గానే … ద్వితీయార్ధంలోను కొనసాగించినట్లైతే సినిమా ఎంత రొటీన్‌గా వున్నా ఎంటర్‌టైన్‌మెంట్‌కి లోటుండేది కాదు.
 
చాలా చోట్ల ‘సినిమా బలహీనపడుతోంది’ అనే సమయానికి నాని తన నేచ్యురల్ పెర్ఫార్మెన్స్ తో నిలబెట్టే ప్రయత్నం చేసి, చాలా చోట్ల సక్సెస్ అయ్యాడు . ప్రథమార్థంలో వచ్చే నాని, అతని మిడిల్ క్లాస్ జీవితం తాలూకు సీన్లు,వదిన మరిది మధ్య కోపతాపాలుండే సన్నివేశాలు… అర్థం చేసుకున్న తర్వాత వచ్చే ఎమోషనల్‌ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. నాని, సాయి పల్లవిల లవ్ ట్రాక్ కూడా సరదాగా సాగుతూ ఆకట్టుకుంది. ప్రారంభంలో రాజీవ్‌ కనకాల, నాని మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు బావున్నాయి . ముఖ్యంగా చివరి పదిహేను నిమిషాలు సినిమా నడక బాగుంది. అయితే ,పతాక సన్నివేశాన్ని వెరైటీగా ప్లాన్‌ చేసారు కానీ, అది కూడా అయిపోయిన కథని ఇంకాస్త పొడిగించడానికి తప్ప పెద్దగా ఉపయోగపడకుండా పోయింది.
 
నాని ఎప్పటిలాగానే సినిమా అంతటా తనదైన ఎనర్జిటిక్‌ పెర్‌ఫార్మెన్స్‌ కనపరిచాడు. ముఖ్యంగా కామెడీ సీన్స్‌లో హావభావాలను బాగా పలికించాడు. అలాగే డ్యాన్సులు కూడా చక్కగా చేశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌ ఫైట్‌ సీన్‌కు ముందు వదిన మంచి తనాన్ని అర్థం చేసుకునే సన్నివేశంలో..అలాగే చివరి పదిహేను నిమిషాలు వదినను కాపాడుకునే సన్నివేశంలో నాని నటన ఆకట్టుకుంటుంది.ఇక భూమిక చావ్లా మంచి పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చింది. వదినగా హుందాగా నటించింది. అయితే ఆమె పాత్రను అవసరమైనంత బలంగా తీర్చిదిద్ద లేకపోయారు. ఇక విలన్‌ విజయ్‌ వర్మ తన పాత్రకు న్యాయం చేశాడు. సాయిపల్లవి తన నటనతో నాని తో పోటిపడింది . నాని, సాయిపల్లవి కలిసి నటించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆట్టుకుంటాయి. సాయిపల్లవి, నాని దగ్గర లవ్‌ ప్రపోజ్‌ చేసే సీన్‌తో పాటు, నానిని ,అతని ఇంట్లోనే ఉండి టీజ్‌ చేసే సీన్‌ … ఇలా అన్నింటా తనదైన నటనతో ఆకట్టుకుంది సాయిపల్లవి. అయితే రెండవ భాగం లో ఆమె పాత్రకు ప్రాధాన్యత తగ్గిపోవడం మైనస్ . ఇక సీనియర్‌ నరేష్‌, ఆమని, రాజీవ్‌ కనకాల, నాని స్నేహితుడిగా నటించిన ప్రియదర్శితో పాటు పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌ వారి పాత్రలకు న్యాయం చేశారు.
 
ఇక దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతంలో టైటిల్‌ సాంగ్‌ మినహా..మిగిలిన పాటలు ఆకట్టుకోలేదు. అసలిది దేవిశ్రీ సంగీతమేనా? అనిపిస్తుంది. అలాగే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఎఫెక్టివ్‌గా లేదు. సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ బావుంది. పాటల చిత్రీకరణలో అందం కనబడింది. వరంగల్‌, లక్నవరం తదితర ప్రాంతాలను సమీర్‌రెడ్డి తన కెమెరాలో చాలా రిచ్‌గా చూపించారు. సెకండాఫ్‌లో రెండు, మూడు సీన్స్‌ మినహా ప్రవీణ్‌పూడి ఎడిటింగ్ బాగుంది . మామిడాల తిరుప‌తి, శ్రీకాంత్ విస్సా సంభాషణలు అక్కడక్కడా బాగున్నాయి -రవళి 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here