‘నటకిరీటి’ డా. రాజేంద్రప్రసాద్`మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్, ప్రఖ్యాత బ్యానర్ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ‘ఆర్గానిక్ మామ.. హైబ్రిడ్ అల్లుడు’ చిత్రంలో బిగ్‌బాస్ ఫేం సోహెల్`మృణాళిని జంటగా నటిస్తున్నారు.యూత్, మెసేజ్, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్ మామ`హైబ్రిడ్ అల్లుడు’. తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డి ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం విశేషం. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల విచ్చేసి ట్రైలర్, టీజర్‌లను లాంచ్ చేశారు.
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ… కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం ఎస్.వి. కృష్ణారెడ్డి అనే ఈ టైటిల్ కార్డు చూసి చాలా రోజులు అయ్యింది. అది చూస్తుంటేనే చాలా సంతోషం అనిపిస్తోంది. కృష్ణారెడ్డి గారి సినిమాలు అంటే ఒక రిలీఫ్. అన్ని వర్గాలకు కావాల్సిన అన్ని అంశాలనూ చక్కగా ఏర్చి, కూర్చి అద్భుతమైన సంగీతంతో మనకు అందిస్తారు. ఉరుకు, పరుగుల ప్రస్తుత జనరేషన్‌కు రిలీఫ్ కోసం కృష్ణారెడ్డిగారి సినిమాలు ఎంతో అవసరం అని నా భావన. ఆయన సినిమాలు కమర్షియల్ హంగులతో ఉంటూనే పిల్లలకు కూడా ఫేవరెట్‌గా ఉంటాయి. ట్రైలర్ చూసిన తర్వాత కృష్ణారెడ్డిగారు కమ్‌బ్యాక్ అని గట్టిగా చెప్పవచ్చు. ఆయన మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను ఇంత అద్భుతంగా నిర్మించిన నిర్మాత కోనేరు కల్పన గారికి యూనిట్ సభ్యులకు నా అభినందనలు అన్నారు.
నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ… కృష్ణారెడ్డి గారు, నేను చిరకాల మిత్రులం. ఈ సినిమా డెఫనెట్‌గా సూపర్‌హిట్ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఫ్యామిలీస్ అందరూ థియేటర్స్‌కు రావడం మానేసి ఇంట్లోనే ఓటీటీలో సినిమాలు చూడటానికి అలవాటు పడ్డారు. ఎందుకంటే ఫ్యామిలీస్‌ను థియేటర్స్‌కు రప్పించే కంటెంట్ సినిమాల్లో తగ్గి పోవడమే. అటువంటి కంటెంట్‌కు కేరాఫ్ అడ్రస్ కృష్ణారెడ్డిగారు. కాబట్టి తప్పకుండా ఈ సినిమాతో మళ్లీ థియేటర్స్ ఫ్యామిలీ ఆడియెన్స్‌తో కళకళలాడతాయి అని నాకు గట్టి నమ్మకం. ఇక రాజేంద్రప్రసాద్ నా హీరో, ఆయనతో ఎక్కువ సినిమాలు చేశాను. మీనాగారు అయితే ఆమె భర్త చనిపోయి బాధలో ఉన్నప్పటికీ నిర్మాతల శ్రేయస్సు ముఖ్యం అని భావించి, ఆయన చనిపోయిన దాదాపు 15 రోజుల తర్వాత షూటింగ్‌కు హాజరయ్యారు. కల్పనా చిత్ర బ్యానర్ 1970ల్లో స్టార్ట్ అయ్యింది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని ఇప్పటికీ నిలబడిరది. ఇది చాలా గర్వకారణమైన విషయం. ఈ సినిమా విషయంలో నా ఇన్‌వాల్వ్‌మెంట్ ఏమీ లేదు. అంతా మా ఆవిడ కల్పనే చూసుకుంది. ఆమెకు, కృష్ణారెడ్డి గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ఈ సినిమా అందరికీ హిట్ ఇస్తుందని ఆశిస్తున్నా అన్నారు.
ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ… నేను 40 దాకా సినిమాలు చేశాను. ఈ సినిమా నిర్మాత కల్పన గారి డెడికేషన్, ప్లానింగ్ చూసిన తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్ నా కెరీర్‌లో ది బెస్ట్ అని చెపుతున్నాను. ఈ సినిమా విషయంలో అచ్చిరెడ్డి గారికి, నిర్మాత కల్పన గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. కరోనా టైంలోనే ఈ కథను రెడీ చేసుకున్నాను. “మాటలు కూడా రాయగలవు” అని అచ్చిరెడ్డి అన్నాడు. అలా రెడీ అయిన ఈ స్క్రిప్ట్‌ను కల్పన గారికి వినిపించగానే ఆమె షాక్ అయ్యారు. “ఇంత మంచి స్క్రిప్ట్ మనం స్క్రీన్ మీద పెట్టక పోతే ఎలా.. మనం ఈ సినిమా చేసేస్తున్నాం అంతే” అని ఆ క్షణంలోనే ఫిక్స్ అయిపోయారు. ఆరోజు నుంచి 44 రోజుల్లోనే సినిమా పూర్తయిపోయింది. రాజేంద్రప్రసాద్ గారు అయితే.. డబ్బింగ్ టైంలో కొన్ని సీన్లు చూసి ఏంటి నేను ఇంత బాగా చేశానా, ఇంత ఎమోషన్ ఈ కేరెక్టర్‌లో ఉందా? అని ఆశ్చర్య పోయారు. ఆయన నటనలో ఒక అద్భుతం అంతే. ఇక మీనా గారి గురించి ఏం చెప్పాలి. ఆమె సూపర్ నటి. ఈ సినిమా టైటిల్ కల్పనగారే పెట్టారు. ఇంతమంది మంచి మనుషులు నా చుట్టూ ఉంటే నా నుంచి ఒక పెద్ద హిట్ ఎందుకు రాకుండా ఉంటుంది. ఇంతమంచి ప్రొడ్యూసర్‌ను నేను చూడలేదు. బహుశా కల్యాణ్‌గారి భార్య కాబట్టే ఆయన నుంచి ప్రొడక్షన్ ఎలా చేయాలో ఆకళింపు చేసుకుని ఉంటారు. సోహెల్‌ను సంతోషం సురేష్ నాకు పరిచయం చేశారు. అతని కలవగానే.. యమలీల చేసిన వాణ్ణి మరో లీల చేయలేనా అనిపించింది. ఇంత మంచి కంటెంట్‌ను తెరకెక్కించడంలో కెమెరామెన్ సి. రాంప్రసాద్ గారు అద్భుతంగా పనిచేశారు. ఫైట్స్, ఎడిటింగ్ ఇలా ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ ఒక తపనతో పనిచేశారు. అన్నారు.
ఈ చిత్ర సమర్పకుడు కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ… కృష్ణారెడ్డి గారితో సినిమా చేయాలని కల్పనగారు చాలాసార్లు అన్నారు. ఈ కథ వినగానే ఆమెకు బాగా నచ్చి, సి. కల్యాణ్ గారికి చెప్పారు. నీకు నచ్చితే ఓకే అని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక ఆమె మమ్మల్ని జెట్ స్పీడ్‌లో పరుగెత్తించారు. ఒక నిర్మాతగా ఆమె స్పీడ్‌ను, కమాండ్‌ను చూసి నేనే ఆశ్చర్యపోయాను. ప్రస్తుత జనరేషన్‌కు ఇది పర్‌ఫెక్ట్ సినిమా. కృష్ణారెడ్డి గారి మార్క్ ఇది. కల్పన గారికి సినిమా మార్కెటింగ్‌లో కూడా చాలా అనుభవం ఉంది. పైగా వెనకాల సి. కల్యాణ్ గారు ఉన్నారు. సినిమా పరిశ్రమలోని అన్ని రంగాల్లో ఆయనకున్న అనుభవం ఎనలేనిది. మంచి టీం ఈ సినిమా కోసం పనిచేసింది అన్నారు.
హీరో సోహెల్ మాట్లాడుతూ… నేను చిన్నప్పటి నుంచి కృష్ణారెడ్డి గారి సినిమాలు చూసి పెరిగాను. ఇప్పుడు ఆయన దర్వకత్వంలో నటించడం అంటే ఇప్పటికీ నమ్మలేని విషయంగానే అనిపిస్తుంది. నాకు ఆయన దర్శకత్వంలో పనిచేసే అవకాశం రావటానికి ముఖ్య కారకులైన సంతోషం సురేష్ గారికి నా కృతజ్ఞతలు. నాలోని టాలెంట్‌ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత కల్పన గారికి నా థ్యాంక్స్. బిగ్‌బాస్ వల్ల నేను చాలా మందికి పరిచయం అయ్యాను. ఇప్పుడు కృష్ణారెడ్డి గారి సినిమా అంటే ఇక ప్రతి కుటుంబానికి చేరువౌతాను అనే నమ్మకం ఉంది. ఇప్పుడు కష్టపడినట్టే ఇక ముందు కూడా కష్టపడుతూనే ఉంటాను అన్నారు.
సునీల్, కృష్ణభగవాన్, సన, ప్రవీణ్, సప్తగిరి, అజయ్‌ఘోష్, రాజా రవీంద్ర, సురేఖ వాణి, పృథ్వి, చలాకీ చంటి, సూర్య, రాజారవీంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: శివ, పాటలు: చంద్రబోస్, రామజోగయ్య, శ్రీమణి, సమర్పణ: కె. అచ్చిరెడ్డి, నిర్మాత: కోనేరు కల్పన, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి.