‘రాయలసీమ లవ్ స్టోరీ’లో ఎవరినీ కించపరచలేదు !

రాయల్ చిన్నా, నాగరాజు నిర్మాతలుగా ఏ 1ఎంటర్టైన్మెంట్స్ మూవీస్ పతాకంపై రామ్ రణధీర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయలసీమ లవ్ స్టోరీ’. వెంకట్, హృశాలి,పావని నటించిన ఈ చిత్రం ఈనెల 27న విడుదల కానుంది. అయితే ఈ సినిమాపై కొంతమంది కొన్ని అభ్యంతరాలను వ్యక్తపరచడంతో చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది…
 
దర్శకుడు రామ్ రణధీర్ మాట్లాడుతూ… ఇటీవలే మా చిత్ర ఆడియో వేడుకలో జి .నాగేశ్వర్ రెడ్డి గారు విడుదల చేసిన ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంత మంది రాయలసీమ ప్రాంత వాసులు మా సినిమాలో వల్గారిటీ ఉందంటూ, రాయలసీమ ప్రాంతాల వారి మనోభావాలను దెబ్బతీసేలా ఈ చిత్ర ట్రైలర్, పోస్టర్ ఉంది గనుక చిత్ర టైటిల్ ను మార్చాలని, లేకపోతే విడుదలను అడ్డుకుంటామంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. పోస్టర్లను పలు ప్రాంతాల్లో చించి వేశారు. అయితే వారికి నేను చెప్పేది ఒక్కటే.. మా ఈ ‘రాయలసీమ లవ్ స్టోరీ’ అనేది కేవలం యూత్ కు మెసేజ్ ఇవ్వాలని … ఒక మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ ని మాత్రమే ఈ చిత్రంలో చూపిస్తున్నామని, ఎవరైతే అడ్డుకుంటామని అంటున్నారో.. వారు సినిమాను చూసి అభ్యంతరం అనిపిస్తే సినిమా టైటిల్ ను కానీ, సన్నివేశాలను కానీ మారుస్తామని చెబుతూ ఆవేదన వ్యక్తపరిచారు.
 
హీరో వెంకట్ మాట్లాడుతూ.. టైటిల్ లోనే స్టోరీ మొత్తం ఉంది . యూత్ ను అట్ట్రాక్ట్ చేయడానికే మాత్రమే తప్ప సినిమాలో ఎక్కడా వల్గారిటీ కానీ, కించపరిచేలా కానీ ఉండదు. మాది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఎమోషనల్ ప్రేమ కథ మాత్రమే.. అర్థం చేసుకొని ఆదరించాలని అన్నారు.
 
నిర్మాతలు చిన్నా,నాగరాజు మాట్లాడుతూ.. ఎంతో కష్టపడి మా చిత్ర యూనిట్ మంచి సినిమా చేశారు. విడుదలైన పాటలు చాలా ఆకట్టుకున్నాయి. సినిమా కూడా విడుదల వరకు వచ్చాక కొంతమంది ‘సినిమా టైటిల్ మార్చాలి’ అంటూ అభ్యంతరం వ్యక్తపరుస్తున్నారు. మా సినిమా ను చూడకుండానే.. ఆ సినిమాలో ఏమిచెప్పారో తెలియకుండానే ఏ విధంగా సినిమా పై అభ్యంతరంవ్యక్త పరచడం సబబు కాదు.రాయలసీమ అనగానే బాంబులు, ఫ్యాక్షన్ అని మాత్రమే కాదు..వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో తెలపడానికే ఈ చిత్రాన్ని నిర్మించాము. వల్గారిటీనో, మరొకరిని కించపరచడమో చూపించలేదు.మా సినిమా చూసాక మీకు అభ్యంతరాలు ఏమైనా ఉంటె మీరు కోరినట్టుగానే మార్పులు చేస్తాము. అంతేకానీ ఇలా చిన్న సినిమాలను ఇబ్బంది పెట్టడం తగదని అన్నారు. అలానే నేటి సమాజంలోని యువతకు మంచి మెసేజ్ ఇవ్వాలనే తపన తప్పించి.. ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యం తమది కాదని చెప్పుకొచ్చారు.